భారతదేశంలో రక్తహీనత (Anemia) సమస్యను పూర్తిగా నిర్మూలించే దిశగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా అనీమియా కేసులను వేగంగా తగ్గించేందుకు వీలుగా 'అనీమియా ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమానికి సంబంధించిన నూతన కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా విడుదల చేశారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న 6x6x6 వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తూ, ఇకపై దీనిని 7x7x7 వ్యూహంగా విస్తరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 16వ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మండలి సమావేశంలో ఈ సరికొత్త మార్గదర్శకాలకు ఆమోదం లభించింది.
సరికొత్త '7x7x7' వ్యూహం అంటే ఏమిటి..?
గతంలో ఉన్న ఆరు రకాల లబ్ధిదారులు, ఆరు ఇంటర్వెన్షన్స్, ఆరు సంస్థాగత యంత్రాంగాలకు ఇప్పుడు ఒక్కొక్కటి చొప్పున అదనంగా జోడించి '7x7x7' గా మార్చారు.
తక్కువ బరువుతో పుట్టే శిశువులకు రక్షణ.. దేశంలో తరతరాలుగా వస్తున్న రక్తహీనత సమస్యను ఆదిలోనే అడ్డుకోవాలనే ఉద్దేశంతో.. మొదటిసారిగా 0 నుంచి 6 నెలల వయస్సు గల తక్కువ బరువుతో పుట్టిన శిశువులను (Low Birth Weight Babies) 7వ లబ్ధిదారుల సమూహంగా చేర్చారు.
'సరైన ఆహారం' (Eating Right)..కేవలం ఐరన్ మాత్రల పంపిణీకే పరిమితం కాకుండా, ప్రజల్లో నిత్యం ఐరన్ అధికంగా ఉండే సమతుల్య పోషకాహార అలవాట్లను పెంపొందించడాన్ని 7వ కీలక జోక్యంగా చేర్చారు.
డిజిటల్ ట్రాకింగ్..లబ్ధిదారుల పర్యవేక్షణ, పారదర్శకత కోసం డిజిటల్ ట్రాకింగ్‌తో కూడిన పటిష్టమైన మూల్యాంకన వ్యవస్థను 7వ సంస్థాగత యంత్రాంగంగా చేర్చారు.
T-3 స్థానంలో విప్లవాత్మక 'T-4' నమూనా..
రక్తహీనత బాధితులకు అందించే సేవల్లో నాణ్యతను పెంచేందుకు ఇప్పటివరకు ఉన్న T-3 (టెస్ట్, ట్రీట్, టాక్) విధానాన్ని మార్చి, T-4 (టెస్ట్, ట్రీట్, టాక్ మరియు ట్రాక్ - Test, Treat, Talk and Track) నమూనాను తీసుకొచ్చారు.
టెస్ట్ (Test): డిజిటల్ పద్ధతుల ద్వారా హిమోగ్లోబిన్ స్థాయిల పరీక్ష.
ట్రీట్ (Treat): జాతీయ అనీమియా మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారం ఖచ్చితమైన చికిత్స.
టాక్ (Talk): పోషకాహార ప్రాధాన్యతపై బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వడం.
ట్రాక్ (Track): చికిత్స అనంతరం రోగి కోలుకునే ప్రక్రియను డిజిటల్ పద్ధతిలో నిరంతరం పర్యవేక్షించడం.
తీవ్ర అనీమియా బాధితులకు ప్రత్యేక చికిత్స..
గర్భిణీలు, పాలిచ్చే తల్లులలో తీవ్రమైన రక్తహీనత ఉన్నా లేదా నోటి ద్వారా తీసుకునే ఐరన్ మాత్రలు పని చేయకపోయినా.. అలాంటి వారికి నేరుగా సిరల ద్వారా 'ఫెర్రిక్ కార్బాక్సిమాల్టోస్', 'ఐరన్ సుక్రోజ్' ఔషధాలను అందించేందుకు ప్రత్యేక క్లినికల్ ఏర్పాట్లు చేశారు.
కేంద్రీకృత డిజిటల్ పోర్టల్.. అనీమియా బాధితుల రికార్డులన్నీ ఇకపై ఒకే డిజిటల్ వేదికపైకి రానున్నాయి. గర్భిణీల వివరాలను 'జననీ' పోర్టల్ ద్వారా, పిల్లల వివరాలను 'RBSK' అండ్ 'యు-విన్' (U-WIN) పోర్టల్‌ల ద్వారా సేకరించి, వాటన్నింటినీ ఒకే రూఫ్ కిందికి తెస్తూ 'అనీమియా ముక్త్ భారత్ అభియాన్ పోర్టల్'ను అభివృద్ధి చేయనున్నారు.
ఈ సాంకేతిక ఆధారిత, ప్రజా భాగస్వామ్య సరికొత్త వ్యూహం ద్వారా దేశంలో శిశు మరణాల రేటు (IMR), ప్రసవ సమయాల్లో తల్లుల మరణాల రేటు (MMR) గణనీయంగా తగ్గుతాయని వైద్య ఆరోగ్య శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది.

