▶ Reels

పిల్లల ముందే ఫోన్ వాడుతున్నారా..? అయితే ముప్పు పొంచి ఉన్నట్టే..!

 



నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ మన దినచర్యలో విడదీయరాని భాగమైపోయింది. పిల్లలు పదే పదే ఫోన్లకు అతుక్కుపోతున్నారని తల్లిదండ్రులు తరచూ ఆందోళన చెందుతుంటారు. కానీ, పిల్లల చేతిలో ఉన్న ఫోన్ కంటే, తల్లిదండ్రుల చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ వల్లే చిన్నారుల భవిష్యత్తుకు ఎక్కువ ప్రమాదం ఉందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.


భాషా వికాసంపై ప్రతికూల ప్రభావం..


పిల్లలు తమ చుట్టూ జరిగే పరిణామాలను గమనిస్తూ కొత్త విషయాలు నేర్చుకుంటారు. ముఖ్యంగా తల్లిదండ్రుల మాటల ద్వారానే వారు భాషను ఒడిసిపట్టుకుంటారు. పిల్లల ముందు పెద్దలు మొబైల్స్‌లో మునిగిపోతే, చిన్నారులతో గడిపే సమయం, వారితో మాట్లాడే అవకాశాలు దారుణంగా తగ్గిపోతాయి.


ఐదేళ్ల వయసులోపే పిల్లల మెదడు 90 శాతం వరకు అభివృద్ధి చెందుతుంది. ఈ సున్నితమైన దశలో వారితో నిరంతర సంభాషణ చాలా అవసరం. తల్లిదండ్రులు స్క్రీన్‌కే పరిమితమైతే, పిల్లల ప్రశ్నలకు సమాధానాలు లభించవు. తద్వారా కొత్త పదాలను గ్రహించే సామర్థ్యం వారిలో మందగిస్తుంది.


నార్వే అధ్యయనంలో విస్తుపోయే నిజాలు..


నార్వేలోని ఓస్లో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 747 మంది పిల్లలపై 5 నుంచి 8 ఏళ్ల వయసు దశలో జరిపిన సుదీర్ఘ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. రోజుకు దాదాపు నాలుగు గంటల పాటు మొబైల్ వాడే తల్లిదండ్రుల పిల్లల్లో..గంట లోపు వారి పిల్లలతో పోలిస్తే భాషా సామర్థ్యాల స్కోరు 2.5 పాయింట్లు తక్కువగా నమోదైంది.


రోజుకు ఐదు గంటల పాటు స్క్రీన్‌కు అలవాటు పడిన రెండేళ్ల చిన్నారులు, తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్న పిల్లల కంటే చాలా తక్కువ పదాలు మాత్రమే మాట్లాడగలిగారు. ప్రస్తుతం 98 శాతం మంది రెండేళ్ల పిల్లలు రోజూ స్క్రీన్ చూస్తున్నారని, ఇది వారి మేధో వికాసానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని డాక్టర్ జునయీ యాంగ్ నేతృత్వంలోని బృందం స్పష్టం చేసింది.


నిపుణుల కీలక సూచనలు..


పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు తమ డిజిటల్ అలవాట్లను మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 2 నుంచి 5 ఏళ్ల వయసున్న పిల్లలకు రోజులో 1 గంటకు మించి ఎట్టిపరిస్థితుల్లోనూ స్క్రీన్ టైమ్ ఇవ్వకూడదు. ఇంట్లో ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్లను పక్కనపెట్టి, పిల్లలతో కలిసి పుస్తకాలు చదవడం, వారికి కథలు చెప్పడం అలవాటు చేసుకోవాలి. రోజువారీ చిన్నచిన్న సంభాషణల ద్వారానే పిల్లలు పదాల అర్థాలను సులభంగా నేర్చుకుంటారని గుర్తుంచుకోవాలి.

Related Blogs


జ్వరం, జలుబుకు ఇంజెక్షన్.. 14 ఏళ్ల బాలిక మృతి! ఖమ్మంలో ఆర్‌ఎంపీపై కేసు

August 12, 2026

  జ్వరం, జలుబుతో...

READ MORE

NEET పరీక్ష నిర్వహణపై పార్లమెంటరీ కమిటీ సమీక్ష.. జూలై 16న కీలక సమావేశం

July 10, 2026

 NEET పరీక్ష నిర్వహ...

READ MORE

దక్షిణాసియా ఆరోగ్య వ్యవస్థల కోసం AI రోడ్‌మ్యాప్.. WHO-SEARO, ISB కీలక భాగస్వామ్యం

July 10, 2026

 ఆరోగ్య రంగంలో **క...

READ MORE

'అనీమియా ముక్త్ భారత్ అభియాన్' కొత్త మార్గదర్శకాలు విడుదల..

July 1, 2026

 భారతదేశంలో రక్త...

READ MORE

క్విక్ డెలివరీ యాప్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రాణాంతక మందుల సరఫరా..?

June 30, 2026

ఈ-కామర్స్, క్విక్-క...

READ MORE
About Health Expert

The Health Expert...


Follow Us


Copyright © The Health Expert. All rights reserved.