శృంగారం తర్వాత సంతోషం కరిగిపోయి.. అకస్మాత్తుగా అంతులేని బాధ, ఒంటరితనం చుట్టుముడుతున్నాయా..? భాగస్వామితో ఎంతో అన్యోన్యంగా, ఆనందంగా గడిపిన క్షణాల తర్వాత కూడా కంటతడి పెట్టుకోవడం లేదా తీవ్రమైన చిరాకు రావడం జరుగుతోందా..? ఎంతో ఇష్టపూర్వకంగా పాల్గొన్నప్పటికీ శృంగారానంతరం ఎదురయ్యే ఈ వింతైన భావోద్వేగ పరిస్థితినే వైద్య నిపుణులు ‘పోస్ట్కోయిటల్ డిస్ఫోరియా’ (Postcoital Dysphoria - PCD) లేదా 'పోస్ట్-సెక్స్ బ్లూస్' అంటారు. ఇది కేవలం మీ ఒక్కరికే ఎదురవుతున్న సమస్య కాదు, ఎంతో ఆరోగ్యకరమైన బంధాల్లో ఉన్నవారిలోనూ, ఎలాంటి మనస్పర్థలు లేని జంటల్లోనూ ఇది సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. అసలు శృంగారం ముగిసిన తక్షణమే మెదడులో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల ఈ విచారకరమైన పరిస్థితి ఎందుకు తలెత్తుతుంది? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు, పరిష్కార మార్గాలపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
తాజా అధ్యయనం ఏం చెబుతోంది..?
‘యూరోపియన్ సైకియాట్రీ’ (European Psychiatry) జర్నల్‌లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం ప్రకారం, ఇష్టపూర్వకంగా, సంతృప్తికరంగా శృంగారంలో పాల్గొన్న తక్షణమే కొందరిలో తీవ్రమైన ఆందోళన, బాధ కలగడం ఒక డిస్ట్రెస్సింగ్ సైకలాజికల్ ఫినామినన్ అని తేలింది.
గతంలో ఈ సమస్య కేవలం మహిళలను మాత్రమే ఎక్కువగా ప్రభావితం చేస్తుందని భావించినప్పటికీ, పురుషులలో కూడా గణనీయమైన సంఖ్యలో ఈ సడన్ ఎమోషనల్ డ్రాప్స్ ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఎంతటి అన్యోన్య దాంపత్యంలోనైనా ఈ అనుభవాలు ఎదురుకావడంతో భాగస్వాములు తీవ్రమైన గందరగోళానికి గురవుతున్నారని ఈ అధ్యయనం పేర్కొంది.
కారణాలేమిటి అంటే..?
హార్మోన్ల మార్పులు..శృంగారంలో పరాకాష్ట (orgasm) చేరుకున్న క్షణంలో శరీరంలో విడుదలయ్యే డోపమైన్ (Dopamine), ఆక్సిటోసిన్ (Oxytocin) వంటి హార్మోన్లు ఒక్కసారిగా పడిపోవడం వల్ల ఈ తాత్కాలిక భావోద్వేగ ప్రతిచర్య కలుగుతుంది.
మానసిక ఒత్తిడి.. గతేడాది వెలువడిన పరిశోధనల ప్రకారం, గతంలో ఏవైనా చేదు అనుభవాలు లేదా లైంగిక ట్రామా (Trauma) ఉన్నవారిలో, అలాగే తీవ్రమైన యాంగ్జైటీ సమస్యలతో బాధపడేవారిలో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది.
పరిష్కార మార్గాలు ఏమిటి..?
ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారు ఎలాంటి అభద్రతాభావానికి గురికాకుండా, భాగస్వామితో ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. శృంగారం ముగిసిన వెంటనే ఒకరినొకరు హత్తుకోవడం (cuddling), ఓదార్పు మాటలు చెప్పుకోవడం లేదా కొద్దిసేపు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం వంటి ఆఫ్టర్ కేర్ (aftercare) పద్ధతులు ఈ భావోద్వేగాల తీవ్రతను తగ్గిస్తాయి. ఈ సమస్య అప్పుడప్పుడూ ఎదురుకావడం సాధారణమే అయినప్పటికీ, ఒకవేళ ఇది తీవ్రరూపం దాల్చి నిత్యం వేధిస్తుంటే మాత్రం తప్పనిసరిగా మానసిక నిపుణులను (Professional help) సంప్రదించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

