ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ (Mpox) కొత్త వేరియంట్లపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న వేళ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కు చెందిన భారతీయ శాస్త్రవేత్తలు ఒక కీలక అధ్యయనాన్ని నిర్వహించారు. మంకీపాక్స్కు చెందిన రెండు ప్రధాన వేరియంట్లు అయిన 'క్లేడ్-1బీ', 'క్లేడ్-2బీ'లు వ్యాధి లక్షణాలు, శరీరంలో వైరస్ వ్యాప్తిలో దాదాపు ఒకే రకమైన ప్రభావాన్ని చూపుతున్నాయని ఈ పరిశోధనలో స్పష్టమైంది.
కుందేళ్లపై శాస్త్రవేత్తల ప్రయోగాలు..
న్యూజిలాండ్ వైట్ జాతికి చెందిన కుందేళ్లపై శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. ఈ రెండు వేరియంట్లు సోకిన ఐదు రోజుల తర్వాత కుందేళ్ల చర్మంపై ఎర్రటి దద్దుర్లు బయటపడ్డాయి. కాలక్రమేణా ఆ దద్దుర్లు ముదురు ఎరుపు రంగులోకి మారి, పొక్కులుగా ఏర్పడ్డాయి. సుమారు రెండు వారాల తర్వాత ఈ గాయాలు మానడం ప్రారంభమయ్యాయి. రెండు రకాల వైరస్లు సోకిన కుందేళ్లలోనూ వ్యాధి లక్షణాలు, తీవ్రతలో పెద్దగా తేడాలేమీ లేవని నిపుణులు గుర్తించారు.
అవయవాల వరకు వైరస్ వ్యాప్తి..
కేవలం చర్మంపైనే కాకుండా శరీరంలోని అంతర్గత భాగాలపై కూడా వైరస్ ప్రభావం ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ముక్కు, చర్మం, వృషణాల (testicles) కణజాలంలో కూడా వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది.బయటకు లక్షణాలు కనిపించకపోయినా..
ఈ ప్రయోగంలో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. కొన్ని కుందేళ్లలో వ్యాధికి సంబంధించిన బాహ్య లక్షణాలు..దద్దుర్లు లాంటివి స్పష్టంగా కనిపించనప్పటికీ, వాటి నమూనాల్లో వైరస్ జన్యు పదార్థం (Genetic material) ఉన్నట్లు తేలింది. అంటే బయటకు ఎటువంటి లక్షణాలు కనిపించకపోయినా, ప్రాణుల శరీరంలో ఈ వైరస్ ఉండే ప్రమాదం ఉందని ఇది సూచిస్తోంది.
ఈ అధ్యయనం ప్రాముఖ్యత ఏంటి..?
మంకీపాక్స్ అనేది జ్వరం, ఒళ్లు నొప్పులు, శోషరస గ్రంథుల (Lymph nodes) వాపు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలతో కూడిన ఒక వైరల్ వ్యాధి. ఐసీఎంఆర్ చేసిన ఈ తాజా జంతు నమూనా (Animal model) అధ్యయనం.. భవిష్యత్తులో ఎంపాక్స్కు మరింత సమర్థవంతమైన మందులు కనుగొనడానికి, వ్యాక్సిన్లు, ఇతర నివారణ చర్యల ప్రభావాన్ని అంచనా వేయడానికి ఎంతగానో సహాయపడుతుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.


