మారిన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు కేవలం ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులకే పరిమితం కాకుండా.. ప్రాణాంతక క్యాన్సర్ల బారిన పడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో అత్యంత సాధారణంగా కనిపించే 'ప్రోస్టేట్ క్యాన్సర్' (Prostate Cancer) ముప్పుకు, మనం తీసుకునే ఆహారానికి మధ్య బలమైన సంబంధం ఉందని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ప్రాసెస్ చేసిన మాంసం, అధిక కొవ్వు, చక్కెరలు ఎక్కువగా ఉంటే ఈ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆహారానికి, ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ఉన్న లింక్..?
'బీజేయూ (BJU) ఇంటర్నేషనల్ జర్నల్'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. అనారోగ్యకరమైన ఆహారం తీసుకునేవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. స్పెయిన్‌లో 1992 నుంచి 1996 మధ్య సుమారు 15,296 మంది పురుషుల ఆహారపు అలవాట్లపై పరిశోధకులు 17 ఏళ్ల పాటు సుదీర్ఘ అధ్యయనం చేశారు. వీరిలో 609 మందికి ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. క్యాన్సర్ బారిన పడిన వారిలో అత్యధికులు నాణ్యత లేని, అనారోగ్యకరమైన ఆహారం తీసుకున్నవారేనని పరిశోధనలో తేలింది.
కార్లోస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్‌కు చెందిన ప్రొఫెసర్, ఈ అధ్యయన ప్రధాన రచయిత అడెలా కాస్టెల్లో-పాస్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. అధిక కొవ్వు ఉండే డైరీ ఉత్పత్తులు, ప్రాసెస్డ్ మీట్, అధిక క్యాలరీలు, సాస్‌లు, స్వీట్లు ఎక్కువగా తీసుకోవడం ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణం. వీటికి బదులుగా సీజనల్ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆలివ్ నూనె వంటివి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చు.
గుర్తించాల్సిన ప్రధాన లక్షణాలు..?
ప్రారంభ దశలో ఈ క్యాన్సర్ లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. వ్యాధి ముదురుతున్న కొద్దీ కింది సమస్యలు తలెత్తుతాయి.
మూత్రవిసర్జనలో ఇబ్బంది, మూత్రం ధార సన్నబడటం.
పదే పదే మూత్రం రావడం, విసర్జన సమయంలో మంట లేదా నొప్పి.
మూత్రం లేదా వీర్యంలో రక్తం పడటం.
క్యాన్సర్ తీవ్రత పెరిగినప్పుడు నడుము, తుంటి, ఎముకల్లో నొప్పి రావడం.
ఎలాంటి కారణం లేకుండానే అకస్మాత్తుగా బరువు తగ్గడం.
ఈ లక్షణాలు సాధారణ ప్రోస్టేట్ గ్రంథి వాపు లేదా ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
నివారణ, జాగ్రత్తలు..
ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించడానికి నిర్దిష్టమైన మందులు లేకపోయినా, ఆరోగ్యకరమైన జీవనశైలితో దీనికి దూరంగా ఉండవచ్చు.
ఆహార నియమాలు..రోజువారీ భోజనంలో తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు దినుసులు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ప్రాసెస్ చేసిన, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలకు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.
వ్యాయామం.. రోజూ వ్యాయామం చేయడం, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
కుటుంబంలో ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్సర్ హిస్టరీ ఉంటే, ముందుజాగ్రత్తగా వైద్యులను సంప్రదించి అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ సలహా లేకుండా సొంతంగా క్యాన్సర్ నివారణ సప్లిమెంట్లు లేదా విటమిన్ మాత్రలు వాడకూడదు.


