మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాల్లో కిడ్నీలు ముఖ్యమైనవి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి, శరీరంలోని వ్యర్థ పదార్థాలు, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అయితే కిడ్నీల పనితీరు మందగించినప్పుడు శరీరంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా మూత్రవిసర్జన సమయంలో కనిపించే కొన్ని అసాధారణ లక్షణాలు కిడ్నీ సమస్యలకు తొలి సంకేతాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిని నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
మూత్రంలో కనిపించే ముఖ్యమైన హెచ్చరికలు..
1. మూత్రంలో ఎక్కువగా నురగ రావడం..
మూత్రవిసర్జన చేసినప్పుడు విపరీతంగా నురగ రావడం, ఆ నురగ త్వరగా తగ్గకపోవడం కిడ్నీ సమస్యకు ప్రధాన సంకేతం కావచ్చు. ఆరోగ్యకరమైన కిడ్నీలు రక్తంలోని ప్రొటీన్లను శరీరంలోనే నిలుపుకుంటాయి. కిడ్నీల వడపోత సామర్థ్యం దెబ్బతిన్నప్పుడు ప్రొటీన్లు మూత్రం ద్వారా బయటకు పోతాయి. దీనివల్లే నురగ వస్తుంది.
2. మూత్రంలో రక్తం కనిపించడం..
మూత్రం గులాబీ, ఎరుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వైద్య పరిభాషలో దీనిని 'హెమట్యూరియా' అంటారు. కిడ్నీలో ఇన్ఫెక్షన్, రాళ్లు, వాపు లేదా మూత్రనాళ సమస్యల వల్ల ఇలా జరగవచ్చు. నొప్పి లేకపోయినా సరే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
3. మూత్రం రంగు మారడం..
సాధారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. అలా కాకుండా నిరంతరం ముదురు పసుపు, గోధుమ లేదా టీ డికాక్షన్ రంగులో వస్తుంటే జాగ్రత్త పడాలి. డీహైడ్రేషన్, కొన్ని రకాల మందులతో పాటు కిడ్నీ, కాలేయ వ్యాధులు కూడా మూత్రం రంగు మారడానికి కారణమవుతాయి.
4. తరచూ మూత్రవిసర్జన..
సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం కిడ్నీ పనితీరు మందగించడానికి సూచిక కావచ్చు. మధుమేహం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ , ప్రోస్టేట్ సమస్యల వల్ల కూడా ఇలా జరుగుతుంది.
5. మూత్రం పరిమాణం తగ్గిపోవడం..
అకస్మాత్తుగా మూత్రం విసర్జన తగ్గిపోయినా లేదా పూర్తిగా ఆగిపోయినా అది తీవ్రమైన కిడ్నీ సమస్యకు సంకేతం కావచ్చు. మూత్రనాళంలో అడ్డంకులు ఏర్పడినప్పుడు లేదా శరీరంలో నీటి శాతం బాగా తగ్గినప్పుడు ఇలా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి.
6. రాత్రిపూట పదేపదే నిద్రలేవాల్సి రావడం..
రాత్రి వేళల్లో మూత్రవిసర్జన కోసం ఎక్కువసార్లు నిద్రలేస్తుంటే దానిని సాధారణ విషయంగా కొట్టిపారేయకండి. కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు మూత్రాన్ని నియంత్రించే సామర్థ్యం తగ్గి, రాత్రిపూట ఎక్కువగా వస్తుంటుంది.
7. మూత్రంలో తీవ్రమైన దుర్వాసన..
మూత్రం నుంచి నిరంతరం విపరీతమైన లేదా అసాధారణ వాసన వస్తుంటే యూరినరీ ఇన్ఫెక్షన్ లేదా డీహైడ్రేషన్ కారణం కావచ్చు. ఈ వాసనతో పాటు మూత్రవిసర్జన సమయంలో మంట, జ్వరం, నడుము కింది భాగంలో నొప్పి ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.


