రోగి లక్షణాలు, ఇటీవల వరద నీటిలో తిరిగిన చరిత్ర ఆధారంగా వైద్యులు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, పీసీఆర్ (PCR) టెస్ట్, యాంటీబాడీ పరీక్షల ద్వారా ఈ ఇన్ఫెక్షన్ను నిర్ధారిస్తారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే సాధారణ యాంటీబయాటిక్ మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. వ్యాధి ముదిరితే ఆసుపత్రిలో చేర్చి నరాల ద్వారా (IV) యాంటీబయాటిక్స్, అవసరమైతే ఆక్సిజన్ అందిస్తూ చికిత్స చేస్తారు.
వానాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. పాటించాల్సిన జాగ్రత్తలివే..
వీలైనంత వరకు రోడ్లపై నిలిచిన మురుగునీరు, వరద నీటిలో నడవకండి. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే గమ్ బూట్లు అంటే రబ్బరు బూట్లు ధరించండి.
తక్షణ శుభ్రత అవసరం: వర్షపు నీటిలో తడిసినా, బురదలో నడిచినా ఇంటికి రాగానే సబ్బు, శుభ్రమైన నీటితో కాళ్లు, చేతులు కడుక్కోవడం లేదా స్నానం చేయడం తప్పనిసరి.కాళ్లు, చేతులపై ఏవైనా కోతలు లేదా పుండ్లు ఉంటే వాటికి వాటర్‌ప్రూఫ్ బ్యాండేజ్ వేసుకోవాలి.
వానాకాలంలో వచ్చే జ్వరం, ఒళ్లు నొప్పులను సాధారణ వైరల్ ఫీవర్ అనుకుని సొంతంగా మందులు వేసుకోవద్దు. వైద్యుడిని సంప్రదించాలి.
ఇంటి చుట్టుపక్కల చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. ఎలుకలు చేరకుండా జాగ్రత్త పడాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. ర్యాట్ ఫీవర్ ఒకసారి వచ్చి తగ్గినంత మాత్రాన మళ్లీ రాదని అనుకోవద్దు; నిర్లక్ష్యం చేస్తే రెండోసారి కూడా సోకే అవకాశం ఉంటుంది.


