ఆరోగ్యం విషయంలో 2026లో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తక్షణ ఫలితాల కోసం వెంపర్లాడే రోజుల నుంచి, సైన్స్ ఆధారితమైన, దీర్ఘకాలిక ప్రయోజనాలనిచ్చే అలవాట్ల వైపు ప్రజలు అడుగులు వేస్తున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తూ ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవనశైలిని మార్చేస్తున్న 8 ప్రధాన ఆరోగ్య ట్రెండ్స్ ఇవే...
1. ఫంక్షనల్ న్యూట్రిషన్..
ఆహారం అంటే కేవలం కడుపు నింపుకోవడానికో, కేలరీలు లెక్కించుకోవడానికో మాత్రమే పరిమితం కాలేదు. తీసుకునే ఆహారం మన మానసిక స్థితిని, హార్మోన్ల సమతుల్యతను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై ఇప్పుడు అందరూ దృష్టి సారిస్తున్నారు. పులియబెట్టిన ఆహారాలు, ఫైబర్ ఎక్కువగా ఉండే భోజనం, బ్లడ్ షుగర్‌ను అదుపులో ఉంచే డైట్ ట్రెండ్‌లోకి వచ్చాయి. పొట్ట ఆరోగ్యానికి (gut health), మెదడుకు మధ్య ఉన్న సంబంధాన్ని సైన్స్ పదే పదే రుజువు చేస్తుండటంతో ఈ విధానానికి ఆదరణ పెరుగుతోంది.
2. దీర్ఘాయుష్షు (Longevity)..
ఎక్కువ కాలం బతకడం ఎవరికైనా ఇష్టమే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. 'ఎన్నాళ్లు బతికాం' అనేదానికంటే 'ఎలా బతికాం' అన్నదే ముఖ్యం. వృద్ధాప్యంలో కూడా ఎవరిపైనా ఆధారపడకుండా, శారీరక చురుకుదనంతో, మానసిక స్థిరత్వంతో 80 ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా జీవించడంపైనే ఇప్పుడు అందరి దృష్టీ ఉంది. జీవితానికి వయసును జోడించడం కాదు.. వయసుకు జీవితాన్ని జోడించడమే దీని ప్రధాన లక్ష్యం.
3. శారీరక దృఢత్వమే పరమావధి (Strength Training)..
ఒకప్పుడు బరువు తగ్గాలంటే కేవలం కార్డియో వ్యాయామాలు..నడక, పరుగు మాత్రమే సరిపోతాయని అనుకునేవారు. ఇప్పుడు అవి కేవలం అనుబంధంగా మారిపోయాయి. కండరాల బలం పెంచే వ్యాయామాలు ఇప్పుడు ప్రతి ఒక్కరి దినచర్యలో తప్పనిసరి భాగమైంది. అయితే, ఇతరులతో పోటీపడి బరువెత్తడం కంటే, సరైన భంగిమలో, కండరాలకు తగిన విశ్రాంతినిస్తూ స్థిరంగా బలాన్ని పెంచుకునే విధానానికి ఇప్పుడు ప్రాధాన్యం ఇస్తున్నారు.
4. జీవనశైలిగా మారిన ఆరోగ్యం..
ఒకప్పుడు ఆరోగ్యం అంటే పండగకో, పబ్బానికో స్పాకు వెళ్లడం లేదా రిట్రీట్‌లలో పాల్గొనడం అనుకునేవారు. కానీ 2026లో వెల్‌బీయింగ్ అనేది ఒక దినచర్యగా మారిపోయింది. ఉదయాన్నే నిద్రలేవడం, స్క్రీన్ టైమ్‌ను తగ్గించుకోవడం, రోజువారీ జర్నలింగ్, బ్రీత్‌వర్క్ (శ్వాస వ్యాయామాలు) లాంటి చిన్న చిన్న అలవాట్లను క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. అడపాదడపా చేసే ఖర్చుల బదులు, రోజువారీ దినచర్యలోనే ఆరోగ్యాన్ని వెతుక్కుంటున్నారు.
5. నిద్రకు ప్రథమ ప్రాధాన్యం..
నిద్రను సమయం వృథాగా భావించే రోజులు పోయాయి. ఇప్పుడు నిద్ర ఒక లగ్జరీ కాదు, అది మన పనితీరును మెరుగుపరిచే ఒక సాధనంగా మారిపోయింది. క్రీడాకారులు, వ్యాపారవేత్తల నుంచి సామాన్యుల వరకు అందరూ నిద్రకు పెద్దపీట వేస్తున్నారు. నిద్రకు ఉపక్రమించే ముందు విశ్రాంతి తీసుకోవడం, ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, స్లీప్ క్వాలిటీని ట్రాక్ చేయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయాయి. సరైన నిద్రే సంపూర్ణ ఆరోగ్యానికి పునాది అని అందరూ గుర్తిస్తున్నారు.
6. మహిళల ఆరోగ్యానికి పెద్దపీట..
మహిళల ఆరోగ్యంపై ఒకప్పుడు ఉన్న అపోహలు, బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితులు ఇప్పుడు తొలిగిపోయాయి. హార్మోన్ల సమస్యలు, పెరిమెనోపాజ్, మెనోపాజ్ వంటి దశల గురించి ఇప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా చర్చిస్తున్నారు. పురుషులకు సంబంధించిన సాధారణ ఆరోగ్య సూత్రాలను మహిళలకు ఆపాదించకుండా, వారి వయసు, వారి శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రత్యేకమైన వైద్య సేవలు, సమాచారం అందుబాటు లోకి వచ్చాయి.
7. ఒత్తిడి లేని ఉత్సాహం..
విపరీతంగా కష్టపడి అలిసిపోవడం (hustle culture) పట్ల ప్రజల్లో విరక్తి మొదలైంది. క్రమశిక్షణ పేరుతో శరీరాన్ని శిక్షించుకునే బదులు, పనుల పట్ల సమతుల్యత పాటిస్తూ స్థిరమైన ఉత్సాహాన్ని కోరుకుంటున్నారు. వారాంతాల్లో విశ్రాంతి తీసుకోవడం, 'రెస్ట్ డేస్' పాటించడం ఇప్పుడు తప్పుగానో, అపరాధ భావంతోనో చూడటం లేదు. తమ పట్ల తాము కరుణతో వ్యవహరిస్తూ, ఆరోగ్యకరమైన జీవనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
8. కేవలం అడుగులే కాదు.. ఆరోగ్యాన్ని ట్రాక్ చేద్దాం..
స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్లు కేవలం ఎన్ని అడుగులు నడిచాం, ఎన్ని కేలరీలు కరిగాయి అని చెప్పడానికే పరిమితం కాలేదు. మన రికవరీ సమయం, ఒత్తిడి స్థాయిలు, హార్ట్ రేట్ వేరియబిలిటీ (HRV), హార్మోన్ల హెచ్చుతగ్గులు వంటి కంటికి కనిపించని ఎన్నో అంశాలను ఇప్పుడు ప్రజలు ట్రాక్ చేస్తున్నారు. మన రోజువారీ భావోద్వేగాల వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకుంటూ, ఆరోగ్యాన్ని కేవలం జిమ్‌కే పరిమితం చేయకుండా మొత్తం జీవితానికి అన్వయించు కుంటున్నారు.

