హెల్త్ ఎక్స్ పర్ట్ : మండిపోతున్న ఎండలు, వేడి గాలులు, విపరీతమైన దుమ్ము ధూళి.. శరీరానికే కాకుండా మన కళ్ళకు కూడా పెద్ద పరీక్షే పెడుతున్నాయి. వేసవి కాలంలో తీవ్రమైన సూర్యరశ్మి (UV rays)కారణంగా కళ్లలో మంట, దురద, కళ్లు ఎర్రబడటం,అలర్జీ వంటి సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. చాలామంది కళ్లలో నలక పడినా, దురద వచ్చినా వెంటనే చేతులతో గట్టిగా రుద్దేస్తుంటారు. అయితే, ఈ చిన్న పొరపాటే పెద్ద ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని కంటి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ ఎండకాలంలో మన నయనాలను సురక్షితంగా ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం..
1. చల్లటి నీటితో ఉపశమనం..
బయట తిరిగి ఇంటికి రాగానే ముఖంతో పాటు కళ్లను కూడా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.
చిట్కా: రోజుకు 2 నుండి 3 సార్లు శుభ్రమైన, చల్లటి నీటితో కళ్లను మెల్లగా కడుక్కోవాలి. ఇది కంటిలో పేరుకుపోయిన దుమ్మును తొలగించి, కళ్లకు తక్షణ చల్లదనాన్ని ఇస్తుంది. అయితే మరీ ఐస్ వాటర్ ఉపయోగించకూడదు.
2. కళ్లను అస్సలు రుద్దకండి..!
కళ్లలో దురదగా అనిపించినప్పుడు చేతులతో నలపడం అత్యంత ప్రమాదకరం. మన చేతులకు ఉండే బ్యాక్టీరియా సులభంగా కంటిలోకి చేరి ఇన్ఫెక్షన్ తీవ్రతను, వాపును మరింత పెంచుతుంది. దురదగా అనిపిస్తే కళ్లను రుద్దే బదులు, చల్లటి నీటితో కడుక్కోవడమే ఉత్తమ మార్గం.
3. 'సన్ గ్లాసెస్' స్టైల్ కోసం కాదు.. రక్షణ కోసం!
వేసవిలో ఇంటి నుండి బయటకు అడుగు పెట్టేటప్పుడు సన్‌గ్లాసెస్ నల్లటి అద్దాలు ధరించడం తప్పనిసరి. UV ప్రొటెక్షన్ ఉన్న మంచి క్వాలిటీ సన్‌గ్లాసెస్ వాడటం వల్ల సూర్యుడి తీవ్రమైన కిరణాలు, వేడి గాలులు నేరుగా కంటిపై పడకుండా ఉంటాయి. ఇది కళ్ళు పొడిబారే (Dry Eyes) సమస్యను నివారిస్తుంది.
4. గ్యాడ్జెట్స్‌కు కాస్త బ్రేక్.. '20-20-20' సూత్రం పాటించండి
ఎండల వల్ల అలిసిపోయిన కళ్లకు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ స్క్రీన్ల మితిమీరిన వాడకం మరింత భారాన్ని పెంచుతుంది. దీనివల్ల కళ్ల నుండి నీరు కారడం, అలసట వస్తాయి.
వైద్యుల సలహా: డిజిటల్ స్క్రీన్లు వాడేటప్పుడు 20-20-20 నియమాన్ని పాటించండి. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ నుండి చూపు తిప్పి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి.
5. పరిశుభ్రత అత్యంత ముఖ్యం..
కళ్ళు చాలా సున్నితమైన అవయవాలు. ఇతరులు వాడిన లేదా మురికిగా ఉన్న టవల్స్, కర్చీఫ్‌లతో కళ్లను తూడ్చుకోకూడదు. ఎల్లప్పుడూ ఉతికిన, శుభ్రమైన కాటన్ రుమాలు మాత్రమే వాడాలి.
సొంత వైద్యం వద్దు..!
చాలామంది కళ్లు ఎర్రబడగానే మెడికల్ షాపుకు వెళ్లి సొంతంగా ఐ-డ్రాప్స్ కొని వాడుతుంటారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడే కొన్ని రకాల చుక్కల మందులు కంటి చూపుకే ప్రమాదంగా మారవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే కంటి వైద్యుడిని (ophthalmologist) సంప్రదించి, వారు సూచించిన డ్రాప్స్ మాత్రమే వాడాలి. వేసవిలో కళ్లను కాపాడుకోవడానికి పుష్కలంగా నీరు తాగాలి. అలాగే ఆకుకూరలు, విటమిన్-ఎ ఎక్కువగా ఉండే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగవుతుంది.


