సాధారణంగా ఉదయం లేవగానే వేడివేడి కాఫీ తాగడం చాలామంది దినచర్య. అలాగే ఆరోగ్యానికి మేలు చేస్తుందని పండ్ల రసాలు తాగుతుంటారు. కానీ, ఇప్పుడు ఈ రెండింటి కలయికతో ఓ కొత్త పానీయం అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. అదే 'ఆరెంజ్ జ్యూస్ కాఫీ'. వినడానికి కాస్త వింతగా అనిపించినా, యూత్ ఇప్పుడు దీనికి బాగా కనెక్ట్ అవుతున్నారు. అసలు ఈ ట్రెండ్ ఏంటి..? ఇది ఆరోగ్యానికి మంచిదేనా..? తదితర వివరాలు తెలుసుకుందాం..
ఏంటిదీ ఆరెంజ్ జ్యూస్ కాఫీ..?
కమలాఫలం (ఆరెంజ్) రసంలోని పులుపు, తీపికి.. కాఫీలోని చేదును జోడించి చేసే ఓ వినూత్న ప్రయోగమే ఈ కాఫీ. కొందరికి ఈ రుచి అమృతంలా అనిపిస్తుంటే, మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. కోల్డ్ కాఫీ, హాట్ ఎస్ప్రెస్సో.. ఏ రూపంలోనైనా సరే ఆరెంజ్ కాంబినేషన్‌తో తాగేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు.
ఇంట్లోనే సులువుగా తయారీ...సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ కాఫీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
ముందుగా రెండు తాజా ఆరెంజ్ పండ్ల నుంచి రసం తీసుకోవాలి. రసం మరీ పుల్లగా లేకుండా చూసుకోవాలి, లేదంటే ఎసిడిటీ రావచ్చు. ఇప్పుడు అందులో ఒక ఎస్ప్రెస్సో షాట్ లేదా ఒక టేబుల్ స్పూన్ స్ట్రాంగ్ ఇన్స్టంట్ కాఫీ డికాషన్ కలపాలి.చల్లగా తాగాలనుకునేవారు రెండు, మూడు ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. రుచికి సరిపడా కొద్దిగా చక్కెర కలుపుకుంటే ట్రెండీ ఆరెంజ్ జ్యూస్ కాఫీ సిద్ధం.ఆరోగ్యపరంగా సురక్షితమేనా..? ట్రెండ్‌లో ఉంది కదా, రుచికి బాగుంది కదా అని దీనిని రోజూ తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని కేవలం అప్పుడప్పుడూ రుచి కోసం మాత్రమే పరిమితం చేయాలి. ఇందుకు ప్రధాన కారణం వాటిలోని ఆమ్ల గుణాలే (Acidic nature).
కెమిస్ట్రీ ఏం చెబుతోంది..?
కాఫీ, ఆరెంజ్ రెండూ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. సాధారణంగా కాఫీ పీహెచ్ (pH) స్థాయి 4.85 - 5.10 మధ్య ఉంటుంది. అలాగే ఆరెంజ్ జ్యూస్ పీహెచ్ (pH) స్థాయి 3.3 - 4.2 మధ్య ఉంటుంది. ఈ రెండు ఆమ్ల గుణాలున్న పదార్థాలు ఒకేసారి కడుపులోకి చేరడం వల్ల జీర్ణశయాంతర వ్యవస్థపై ఒత్తిడి పడి, తీవ్రమైన ఎసిడిటీకి దారితీసే ప్రమాదం ఉంది.
ఎవరు దూరంగా ఉండాలి..?
ఈ సమస్యలు ఉన్నవారు ఈ ట్రెండీ పానీయానికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.. గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD).. ఛాతీలో మంటతో బాధపడేవారు దీన్ని తాగితే సమస్య మరింత జటిలమవుతుంది.కడుపు ఉబ్బరం, గ్యాస్: తరచుగా అజీర్తి, గ్యాస్ సమస్యలు ఉన్నవారికి ఈ కాంబినేషన్ సరిపడదు.అల్సర్లు: కడుపులో అల్సర్లు ఉన్నవారు పుల్లటి సిట్రస్ జాతి పండ్ల రసాలకు కాఫీని జోడించి తాగడం వల్ల కడుపులో మంట, నొప్పి తీవ్రమయ్యే అవకాశం ఉంది.

