
ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల్లో చక్కెర, ఉప్పు, కొవ్వుల శాతాన్ని నియంత్రించే దిశగా భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, హానికరమైన పదార్థాలు అధికంగా ఉండే ప్యాకెట్లపై 'ఎరుపు రంగు హెచ్చరిక' అంటే రెడ్ అలర్ట్ ముద్రించాలని ప్రతిపాదించింది.
హెచ్చరికల ఉద్దేశం..?
ఏయే పదార్థాల్లో ఉప్పు, చక్కెర, కొవ్వులు మోతాదుకు మించి ఉన్నాయో వినియోగదారులు కొనుగోలు చేయడానికి ముందే సులభంగా గుర్తించేలా ప్యాకెట్‌పై ఎర్రటి రంగులో హెచ్చరికలు ముద్రించనున్నారు.
లేబుల్‌పై ఏముంటుంది..?
'అధిక కొవ్వు', 'అధిక చక్కెర', 'అధిక ఉప్పు', లేదా 'అధిక తీపి పానీయం' వంటి వివరాలు స్పష్టంగా, కంటికి కనిపించేలా ఈ లేబులింగ్ విధానం ఉండనుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
బహుళజాతి సంస్థల వ్యతిరేకత..
ఆరోగ్య హెచ్చరికల వల్ల తమ ఉత్పత్తుల విక్రయాలు భారీగా పడిపోతాయన్న భయంతో నెస్లే, పెప్సికో, కోకాకోలా లాంటి బహుళజాతి సంస్థలు ఈ లేబులింగ్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
సుప్రీంకోర్టు జోక్యం..
పాశ్చాత్య దేశాల తరహాలో మన దేశంలో కూడా ప్యాకేజ్డ్ ఫుడ్‌పై స్పష్టమైన ఆరోగ్య హెచ్చరికలు ఉండాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ హెచ్చరికల ముద్రణ ప్రక్రియను తక్షణమే వేగవంతం చేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి స్పష్టం చేసింది.
జాప్యంపై న్యాయస్థానం అసహనం..
ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై హెచ్చరికల లేబుల్స్ తీసుకురావడంలో జరుగుతున్న సుదీర్ఘ జాప్యం పట్ల అత్యున్నత న్యాయస్థానం ఎఫ్ఎస్ఎస్ఏఐని తీవ్రంగా మందలించింది. ప్రజల ఆరోగ్య హక్కును కాపాడే ఈ నిబంధనల అమలులో ఇకపై ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడదని ఆదేశించింది.

