పెరుగుతున్న బరువు, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. వయసు పైబడుతున్న కొద్దీ ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్లే ఈ ముప్పు పెరుగుతోంది. వృద్ధాప్యంలో బరువును అదుపులో ఉంచుకోవడం ఎందుకు ముఖ్యం..? కొవ్వును సులువుగా ఎలా కరిగించుకోవచ్చో తెలుసుకుందాం..
వయసుతో పాటే వచ్చే చిక్కులు..
వయసు పెరిగే కొద్దీ కండరాల బలం, ఎముకల దృఢత్వం తగ్గుతాయి. అలాగే శరీరం క్యాలరీలను కరిగించే సామర్థ్యం కూడా మందగిస్తుంది. ఇలాంటి సమయంలో శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోతే.. మధుమేహం (diabetes), అధిక రక్తపోటు (hypertension), గుండె జబ్బులు, కీళ్ల నొప్పుల ప్రమాదం పెరుగుతుంది. బరువు పెరగడం వల్ల నడవడం, మెట్లు ఎక్కడం వంటి రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. నిద్రలేమి సమస్యలు కూడా వేధిస్తాయి.
కొవ్వు కరిగించే 'హెచ్ఐఐటీ' (HIIT)..
వృద్ధులు బరువును అదుపులో ఉంచుకోవడానికి సరైన ఆహారంతో పాటు వ్యాయామం ఎంతో అవసరం. అయితే, వృద్ధుల్లో కండరాల సామర్థ్యం తగ్గకుండా, కేవలం కొవ్వును మాత్రమే కరిగించడానికి 'హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT)' అద్భుతంగా పనిచేస్తుందని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ ది సన్షైన్ కోస్ట్ పరిశోధకులు ఇటీవల తేల్చారు.
అధ్యయనం ఏం చెబుతోంది..?
సుమారు 72 ఏళ్ల సగటు వయసున్న 123 మంది ఆరోగ్యవంతమైన వృద్ధులపై ఆరు నెలల పాటు ఈ అధ్యయనం చేశారు. ఈ హెచ్ఐఐటీ వ్యాయామం చేసిన వారిలో శరీరంలోని కొవ్వు వేగంగా కరగడంతో పాటు, కండరాలు, ఎముకల ఆరోగ్యం ఏమాత్రం దెబ్బతినలేదని 'మెటురిటాస్' మెడికల్ జర్నల్లో ప్రచురితమైన ఈ నివేదిక వెల్లడించింది. అదే సాధారణ వ్యాయామం చేసిన వారిలో కొవ్వుతో పాటు కండరాల బలం కూడా కొంతమేర తగ్గినట్లు గుర్తించారు.
హెచ్ఐఐటీ (HIIT) అంటే ఏమిటి..?
ఈ విధానంలో తక్కువ సమయంలోనే చాలా వేగంగా, తీవ్రతతో కూడిన వ్యాయామం చేస్తారు. ఉదాహరణకు.. కొన్ని సెకన్ల పాటు చాలా వేగంగా సైకిల్ తొక్కడం లేదా వేగంగా పరిగెత్తడం (వాకింగ్ చేయడం) చేసి, ఆ తర్వాత కాసేపు నెమ్మదిగా చేస్తూ విశ్రాంతి తీసుకోవాలి. ఇలా ఈ ప్రక్రియను పదేపదే పునరావృతం చేస్తారు.
దీనివల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది.ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి షుగర్ అదుపులో ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరీలు కరిగి, బరువు నియంత్రణలో ఉంటుంది.
ఈ 'హెచ్ఐఐటీ' వ్యాయామం అందరికీ మంచిది కాదు. ముఖ్యంగా వృద్ధులు, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వైద్యుడి సలహా లేకుండా ఇలాంటి కఠినమైన వ్యాయామాలు సొంతంగా చేయకూడదు. దీనివల్ల గుండె స్పందనల రేటు అకస్మాత్తుగా పెరిగిపోవడం, కండరాలు-ఎముకలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి నిపుణుల పర్యవేక్షణలోనే వీటిని ప్రారంభించాలి


