రోగుల భద్రత కోసం ప్రత్యేక సెల్లు ఏర్పాటు చేయాలి.. వైద్యపరమైన పొరపాట్లను తగ్గించడమే లక్ష్యం
దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రుల్లో రోగుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రతి సంస్థలో ప్రత్యేకంగా పేషెంట్ సేఫ్టీ సెల్ ఏర్పాటు చేయడంతో పాటు, బాధ్యతలు నిర్వహించేందుకు పేషెంట్ సేఫ్టీ నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని సూచించింది.
ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి
బోధనాసుపత్రుల్లో వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులతో పేషెంట్ సేఫ్టీ కమిటీ లేదా సెల్‌ను ఏర్పాటు చేయాలి. రోగుల భద్రతకు సంబంధించిన ప్రామాణిక విధానాలను (SOPs) అమలు చేయడం, వాటి పనితీరును పర్యవేక్షించడం, ఎప్పటికప్పుడు సమీక్షించడం ఈ కమిటీ బాధ్యతగా ఉంటుంది.
వివరాలను NMCకి పంపాలి
మెడికల్ కాలేజీల డీన్లు, ప్రిన్సిపాళ్లు, డైరెక్టర్లు తమ సంస్థల్లో ఏర్పాటు చేసిన భద్రతా కమిటీల తుది సభ్యుల జాబితాతో పాటు నోడల్ ఆఫీసర్ల వివరాలను నేషనల్ పేషెంట్ సేఫ్టీ సెక్రటేరియట్‌కు ఈమెయిల్ ద్వారా పంపించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
రోగులకు ఎలా ప్రయోజనం?
ఈ చర్యల ద్వారా చికిత్స సమయంలో నివారించగల ప్రతికూల పరిణామాలు, వైద్యపరమైన పొరపాట్లను తగ్గించడం ప్రధాన లక్ష్యం. వైద్య సేవల్లో సామర్థ్యం పెరగడం వల్ల రోగులపై పడే అదనపు ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే రోగుల సంతృప్తిని పెంచడంతో పాటు వైద్య వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని బలోపేతం చేయాలని NMC భావిస్తోంది.
వైద్యపరమైన పొరపాట్లు జరిగిన తర్వాత స్పందించడానికే పరిమితం కాకుండా, ముందుగానే ప్రమాదాలను గుర్తించి నివారించే విధానాన్ని ప్రోత్సహించడం ఈ చర్యల్లో మరో ముఖ్య ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో రోగుల భద్రతకు ప్రాధాన్యమిచ్చే వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇది కీలకంగా మారనుంది.


