చాక్లెట్ తినాలనీ, కరకరలాడే చిప్స్ నమలాలనీ లేదా స్వీట్లు లాగించేయాలనీ కోరికగా ఉందా..? నాలుక అడిగే ఈ రుచుల కోసం ఆరోగ్యంతో రాజీ పడాలా..? అవసరం లేదంటున్నారు పోషకాహార నిపుణులు. ఇష్టమైనవి తింటూనే ఆరోగ్యాన్ని కాపాడుకునే సరికొత్త విధానమే 'హెల్తీ ఇండల్జెన్స్' (Healthy Indulgence). అంటే కోరికలను పూర్తిగా చంపుకోకుండా, రుచితో పాటు శరీరానికి పోషకాలను అందించే ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం. మారుతున్న స్మార్ట్ స్నాకింగ్ ట్రెండ్‌లో ఇది ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందుతోంది.
హెల్తీ ఇండల్జెన్స్ ప్రాముఖ్యత..
మన దేశంలో ఇప్పుడు తీసుకుంటున్న ప్రతి 5 స్నాక్స్‌లో ఒకటి ఆరోగ్యంతో ముడిపడి ఉంటోంది. క్రమంగా భారతీయులు స్మార్ట్ స్నాకింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. హెల్తీ ఇండల్జెన్స్ అంటే ఆరోగ్యానికి హాని కలగకుండా ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించడం. కడుపు నిండా జంక్ ఫుడ్ తినడం, ఒత్తిడి లేదా విసుగుతో ఎడాపెడా లాగించేయడం వంటివి అనారోగ్యకరమైన అలవాట్లు. దీనికి భిన్నంగా, ఏది తినాలో ఎంత తినాలో స్పష్టమైన అవగాహనతో, మితంగా ఆహారం తీసుకుంటూ అప్పుడప్పుడూ ఇష్టమైన డెజర్ట్‌లను ఆస్వాదించడమే హెల్తీ ఇండల్జెన్స్. ఇందులో రుచితో పాటు శరీరానికి అవసరమైన పోషణకు పెద్దపీట వేస్తారు.
ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఇవే..
నాలుక ఏదైనా కొత్త రుచిని కోరుకున్నప్పుడు అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ కు బదులు ఈ కింది వాటిని ఎంచుకోవాలి:
చాక్లెట్..సాధారణ మిల్క్ చాక్లెట్‌కు బదులుగా 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ కోకో ఉండే డార్క్ చాక్లెట్ తినాలి.
చిప్స్..నూనెలో వేయించిన బంగాళదుంప చిప్స్ స్థానంలో, నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసిన మఖానా లేదా ఇంట్లో తయారు చేసిన పాప్‌కార్న్ తీసుకోవాలి.
కుకీలు, బిస్కెట్లు..మైదాతో చేసే వీటికి బదులుగా బాదం, వాల్నట్స్ వంటి నట్స్ ఎంచుకోవడం మేలు.
స్వీట్లు.. చక్కెరతో చేసిన మిఠాయిలకు బదులు ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్‌తో చేసిన లడ్డూలను చిన్న సైజులో మితంగా తినాలి.
ఐస్‌క్రీమ్.. ఐస్‌క్రీమ్ తినాలనిపిస్తే అదనపు చక్కెరలు వేయని బనానా ఐస్‌క్రీమ్ లేదా ఫ్రూట్ యోగర్ట్ ఆస్వాదించవచ్చు.
పిజ్జా.. మైదాతో చేసిన పిజ్జా బేస్‌కు బదులు గోధుమ పిండి, ఎక్కువ కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.
కూల్ డ్రింక్స్.. శీతల పానీయాల స్థానంలో నిమ్మరసం, కొబ్బరినీళ్లు లేదా మసాలా మజ్జిగ తాగడం ఉత్తమం.
పాటించాల్సిన ముఖ్య నియమం..
హెల్తీ ఇండల్జెన్స్ను దినచర్యలో భాగం చేసుకోవాలంటే 80:20 నియమాన్ని పాటించడం అలవాటు చేసుకోవాలి. అంటే మీరు తీసుకునే ఆహారంలో 80 శాతం పోషకాలతో కూడినదై ఉండాలి. మిగిలిన 20 శాతం మీకిష్టమైన రుచులను ఆస్వాదించవచ్చు. ఇష్టమైనవి తిన్నప్పుడు అపరాధ భావానికి గురికావాల్సిన అవసరం లేదు. కానీ రోజూ స్వీట్లు, జంక్ ఫుడ్ తినే అలవాటుకు మాత్రం దూరంగా ఉండాలి. సమతుల్య ఆహారం తీసుకుంటూ నాలుక కోరికలను ఆరోగ్యకరమైన రీతిలో తీర్చుకోవడమే దీర్ఘకాలిక ఆరోగ్యానికి అసలైన రహస్యం.


