ఉదయం నిద్రలేవగానే మొబైల్ చూడటం.. ఆఫీసులో రోజంతా ల్యాప్‌టాప్ ముందు కూర్చుని పనిచేయడం.. రాత్రి పడుకునే ముందు సోషల్ మీడియా స్క్రోలింగ్.. ఇదీ నేటి సగటు మనిషి దినచర్య. డిజిటల్ టెక్నాలజీ మన పనులను, కమ్యూనికేషన్‌ను సులభతరం చేసిన మాట వాస్తవమే. కానీ, అదే సమయంలో మన ఆరోగ్యానికి ఎన్నో కొత్త ముప్పులను తెచ్చిపెడుతోంది.
గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం, స్క్రీన్లకు అతుక్కుపోవడం వల్ల కళ్లు, కండరాలు, నిద్ర, జీవక్రియలపై తీవ్ర ప్రభావం పడుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రోగాలకు ఆహ్వానం..
మొబైల్, ల్యాప్‌టాప్‌ల చుట్టూనే మన ప్రపంచం తిరుగుతుండటంతో శారీరక శ్రమ తగ్గిపోయింది. గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చుని పనిచేయడం, రాత్రిళ్లు నిద్రను నిర్లక్ష్యం చేయడం వల్ల స్థూలకాయం, మధుమేహం (డయాబెటిస్), అధిక రక్తపోటు (bp), మానసిక ఒత్తిడి లాంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం.. ఎక్కువ సమయం పాటు శారీరక కదలికలు లేకుండా ఒకేచోట కూర్చోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
నిద్ర, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..
రాత్రి వేళల్లో ఎక్కువసేపు మొబైల్ వాడటం వల్ల నిద్రపోయే సమయం క్రమంగా మారిపోతుంది. నిరంతరం నోటిఫికేషన్లు చెక్ చేయడం, వీడియోలు స్క్రోల్ చేయడం వల్ల మెదడుకు తగినంత విశ్రాంతి లభించదు.
నిద్రలేమి వల్ల మరుసటి రోజు విపరీతమైన అలసట, చికాకు, ఏకాగ్రత లోపించడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.
ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లలో అధిక స్క్రీన్ టైమ్ కారణంగా వారి ఫిట్నెస్ దెబ్బతినడమే కాకుండా, ప్రవర్తనాపరమైన మార్పులు కనిపిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
కళ్లు, మెడ, నడుము నొప్పులు..
నిరంతరంగా స్క్రీన్ వైపే చూడటం వల్ల కళ్లు పొడిబారడం, చూపు మసకబారడం, తలనొప్పి లాంటి ఇబ్బందులు వస్తాయి. అలాగే, తప్పు భంగిమలో కూర్చోవడం వల్ల మెడ, భుజాలు, నడుము నొప్పి బారిన పడక తప్పదు.
డిజిటల్ యుగంలో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి..?
మొబైల్, కంప్యూటర్లు లేకుండా నేటి రోజుల్లో ఏ పనీ జరగదు. కాబట్టి వాటిని వదిలేయడం సాధ్యం కాదు. కానీ, వాటి వాడకంలో కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకుంటే ముప్పును తప్పించుకోవచ్చు.
సరైన భంగిమ..కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ వాడుతున్నప్పుడు స్క్రీన్ కంటికి సమాంతరంగా (Eye level) ఉండేలా చూసుకోవాలి. నిటారుగా కూర్చోవాలి.
విరామం తప్పనిసరి.. పని మధ్యలో తరచుగా చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. కళ్లను స్క్రీన్ పైనుంచి పక్కకు తిప్పాలి. గంటకోసారైనా కుర్చీలోంచి లేచి కాస్త అటూఇటూ నడవాలి. దీనివల్ల కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది.
వ్యాయామం: రోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కనీసం అరగంట పాటు వాకింగ్ లేదా ఏదైనా వ్యాయామం చేయడానికి సమయం కేటాయించాలి.
నిద్రకు ముందు వద్దు..రాత్రి పడుకోవడానికి కనీసం గంట ముందు మొబైల్, టీవీ లాంటి స్క్రీన్లకు దూరంగా ఉండాలి.
భోజన సమయంలో..భోజనం చేసేటప్పుడు మొబైల్ చూడటం, టీవీ చూడటం లాంటి అలవాట్లను పూర్తిగా మానుకోవాలి.
సాంకేతికతను వాడుకుందాం.. కానీ అది మన ఆరోగ్యాన్ని శాసించే స్థాయికి చేరకుండా పరిమితులు విధించుకోవడం ప్రస్తుత తరుణంలో అత్యంత ఆవశ్యకం!


