ఢిల్లీలో విజృంభించిన హెచ్1ఎన్1 (Swine Flu) వైరస్ ఇప్పుడు బెంగళూరులోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. ఫ్లూ లాంటి లక్షణాలతో వందలాది మంది పిల్లలు అస్వస్థతకు గురవుతుండటం తల్లిదండ్రులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఇన్ఫెక్షన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఢిల్లీ తర్వాత బెంగళూరులో..
గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసులు అనూహ్యంగా పెరిగాయి (దాదాపు ఆరు రెట్లు). ఇప్పుడు ఈ ప్రభావం బెంగళూరు లోనూ కనిపిస్తోంది. అక్కడి ఒక ప్రముఖ పాఠశాలలో ఏకంగా 500 మందికి పైగా విద్యార్థులు, 21 మంది సిబ్బంది జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పుల బారిన పడ్డారు. వీరిలో ఇద్దరు విద్యార్థులకు 'హెచ్1ఎన్1' పాజిటివ్ అని తేలడంతో ముందుజాగ్రత్తగా పాఠశాలను తాత్కాలికంగా మూసివేశారు.
డాక్టర్లు ఏమంటున్నారు..?
హెచ్1ఎన్1 అనేది ఒక రకమైన ఇన్ఫ్లుయెంజా (Flu) వైరస్. వ్యాధి సోకిన వారు దగ్గడం, తుమ్మడం వల్ల ఇది గాలి ద్వారా ఇతరులకు వేగంగా వ్యాపిస్తుంది. పాఠశాలల్లో పిల్లలు ఎక్కువ సమయం కలిసి ఉంటారు కాబట్టి, అక్కడ ఒకరి నుంచి మరొకరికి సులభంగా అంటుకుంటుంది. అయితే ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి.. వందలాది పిల్లలు జ్వరాల బారిన పడినంత మాత్రాన అదంతా స్వైన్ ఫ్లూనే అని భయపడాల్సిన పనిలేదు. వాతావరణ మార్పుల వల్ల వచ్చే సాధారణ ఫ్లూ కూడా కావచ్చు. అయినప్పటికీ ఏమరుపాటు పనికిరాదు.
పొంచి ఉన్న ప్రమాదాలు..
సాధారణంగా ఈ వైరస్ ప్రాణాంతకం కానప్పటికీ, నిర్లక్ష్యం చేస్తే ఊపిరితిత్తులకు సోకి నిమోనియాగా మారే ప్రమాదం ఉంది. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది.
5 ఏళ్ల లోపు పిల్లలకు ఈ ముప్పు ఎక్కువ.
ఆస్తమా, టైప్-1 డయాబెటిస్, పుట్టుకతోనే గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
ఈ లక్షణాలు కనిపిస్తే ..
పిల్లకు సాధారణ జ్వరం లేదా దగ్గు ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ, కింది లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతు న్నా, ఊపిరి వేగంగా తీసుకుంటున్నా. గాలి తీసుకునేటప్పుడు పక్కటెముకలు లోపలికి లాగుతున్నట్లుగా అనిపిస్తే. పిల్లలు డీహైడ్రేషన్ బారిన పడి, నీరసంగా మారిపోతే.
రెండు మూడు రోజుల్లో జ్వరం..
తగ్గిపోయిందనుకున్నాక.. మళ్లీ అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం, దగ్గు మొదలైతే.. తప్పనిసరిగా డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి.
పిల్లలను ఎలా రక్షించుకోవాలి..?
బడికి పంపొద్దు: పిల్లలకు జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉంటే స్కూల్‌కి పంపకండి. ఇంట్లోనే పూర్తి విశ్రాంతి తీసుకోనివ్వాలి.
చేతుల శుభ్రత: తరచూ సబ్బు, నీళ్లతో చేతులు శుభ్రంగా కడుక్కోవడం పిల్లలకు అలవాటు చేయాలి. కళ్లు, ముక్కు, నోటిని పదేపదే తాకకుండా చూడాలి.
మాస్క్, టిష్యూ వాడకం..
దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముఖానికి టిష్యూ లేదా వస్త్రాన్ని అడ్డు పెట్టుకోవడం నేర్పించాలి.
హైడ్రేషన్.. ద్రవ పదార్థాలు నీళ్లు, ఓఆర్ఎస్, కొబ్బరినీళ్లు ఎక్కువగా ఇస్తూ డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి.
వ్యాక్సినేషన్..వైద్యుల సలహా మేరకు పిల్లలకు ముందు జాగ్రత్తగా ఫ్లూ వ్యాక్సిన్ ఇప్పించడం ఉత్తమం.
సొంత వైద్యం వద్దు..
స్వైన్ ఫ్లూ లేదా ఏదైనా ఫ్లూ వైరస్ బారిన పడినప్పుడు సొంతంగా 'యాంటీబయాటిక్స్' (Antibiotics) వాడకూడదు. వైరస్‌లపై ఇవి పనిచేయవు. డాక్టర్లు సూచించిన మందులు మాత్రమే వాడాలి.

