ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (IIRF) 2026 ర్యాంకింగ్స్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలు వెనుకబడ్డాయి. దేశవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ 144 ప్రభుత్వ వైద్య విద్యాసంస్థల జాబితాలో రాష్ట్రం నుంచి కేవలం నాలుగు కళాశాలలు మాత్రమే చోటు దక్కించుకోవడం గమనార్హం. తెలంగాణలో ప్రస్తుతం 36 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా, వీటి ద్వారా 4,400కు పైగా ఎంబీబీఎస్ (MBBS) సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, రాష్ట్రంలో వైద్య విద్య విస్తరణలో భాగంగా ఇటీవల కాలంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏవీ ఈ జాబితాలో స్థానం సంపాదించలేకపోయాయి.
ముందంజలో గాంధీ, ఉస్మానియా...
రాష్ట్రం నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాల 43వ ర్యాంకుతో ముందంజలో నిలిచింది.
ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాల 52వ ర్యాంకును కైవసం చేసుకుంది.
వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల 60వ స్థానంలో నిలవగా.. ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) 139వ స్థానంతో సరిపెట్టుకుంది.
జాతీయ స్థాయిలో ప్రభుత్వ వైద్య కళాశాలల విభాగంలో దిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
మెరుగ్గా ప్రైవేటు కళాశాలల పనితీరు..
ప్రభుత్వ కళాశాలలతో పోలిస్తే ప్రైవేటు వైద్య కళాశాలల విభాగంలో తెలంగాణ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఐఐఆర్ఎఫ్ జాబితాలో దేశవ్యాప్తంగా 187 ప్రైవేటు కళాశాలలకు ర్యాంకులు కేటాయించగా, అందులో రాష్ట్రం నుంచి ఏకంగా 18 కళాశాలలు చోటు దక్కించుకున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 29 ప్రైవేటు వైద్య కళాశాలలు ఉండగా, వీటిలో సుమారు 5,850 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కాగా, జాతీయ స్థాయిలో ప్రైవేటు విభాగంలో వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (CMC) అగ్రస్థానంలో నిలిచింది.
దంత వైద్య కళాశాలల విభాగంలో..
డెంటల్ కళాశాలల ర్యాంకింగ్స్‌లో తెలంగాణ నుంచి మూడు విద్యాసంస్థలు సత్తా చాటాయి.
సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రాష్ట్రంలోనే అత్యుత్తమంగా 33వ ర్యాంకు సాధించింది.
హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ 53వ ర్యాంకులో, మల్లారెడ్డి డెంటల్ కాలేజ్ ఫర్ ఉమెన్ 64వ ర్యాంకులో నిలిచాయి.
దంత వైద్య కళాశాలల విభాగంలో దిల్లీలోని మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
ప్రామాణికాలు ఇవే..
ఈ ఐఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌ను కేవలం అకడమిక్ పనితీరు ఆధారంగానే కాకుండా, మొత్తం తొమ్మిది ప్రధాన అంశాలను 100% మూల్యాంకనం ఆధారంగా నిర్ణయించారు. అవి ఏమిటంటే..?
అకడమిక్ రిప్యుటేషన్
గ్రాడ్యుయేట్ అవుట్‌కమ్స్, ఎంప్లాయబిలిటీ
రీసెర్చ్ అవుట్‌కమ్స్
డిమాండ్ రేషియో, స్టూడెంట్ ప్రొఫైల్
ఎంప్లాయర్ రిప్యుటేషన్, ఇంటర్నేషనల్ అవుట్‌లుక్
వెల్బీయింగ్, ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్
పీర్ పర్సెప్షన్, అలుమ్ని ఫీడ్‌బ్యాక్
పబ్లిక్ పర్సెప్షన్, డేటా వెరిఫికేషన్
ఇంపాక్ట్, వాల్యూ అడిషన్.

