రాజస్థాన్ రాష్ట్రంలో విద్యార్థుల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా హైకోర్టు చారిత్రక తీర్పును వెలువరించింది. పాఠశాలల క్యాంటీన్లతో పాటు, ఆవరణకు 50 మీటర్ల పరిధిలో ఎలాంటి జంక్ ఫుడ్ విక్రయాలు జరగకుండా పూర్తిగా నిషేధిస్తూ కఠిన ఆదేశాలు జారీ చేసింది.
తీర్పులోని ప్రధానాంశాలు..
జస్టిస్ అనూప్ కుమార్ ధండ్ నేతృత్వంలోని ధర్మాసనం పిల్లల ఆహారపు అలవాట్లు, అలాగే పెరుగుతున్న స్క్రీన్ టైమ్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. స్కూల్ గేటుకు 50 మీటర్ల లోపు చిప్స్, కోల్డ్ డ్రింక్స్, అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉండే అనారోగ్యకరమైన పదార్థాలను విక్రయించకూడదు.
2020లో రూపొందించిన పౌష్టికాహార మార్గదర్శకాలను ఆరు సంవత్సరాలుగా సరిగ్గా అమలు చేయకపోవడం పట్ల న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ప్రతి పాఠశాలలో నాలుగు వారాల్లోగా 'స్కూల్ ఫుడ్ సేఫ్టీ అండ్ న్యూట్రిషన్ కమిటీ'ని పాఠశాల ఆహార భద్రత, పోషకాహార కమిటీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఈ ఆదేశాల అమలును పర్యవేక్షించేందుకు జిల్లా మేజిస్ట్రేట్లు, విద్యాశాఖాధికారులు ప్రతి నెలా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి.
పోషక విలువల ప్రదర్శన తప్పనిసరి
క్యాంటీన్లలో విక్రయించే ప్రతి పదార్థానికి సంబంధించిన కేలరీలు, అందులో వాడిన దినుసులు, పోషక విలువల వివరాలతో కూడిన మెనూ బోర్డును ప్రదర్శించాలి. మధ్యాహ్న భోజన పథకంలో కేవలం కడుపు నింపడమే కాకుండా, సమతుల్య ఆహార ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని కోర్టు స్పష్టం చేసింది.
సాంకేతికతతో పాటు ప్రాథమిక నైపుణ్యాలకు పెద్దపీట
విద్యాబోధనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇతర ఆధునిక సాంకేతికతను ఉపయోగించినప్పటికీ, అవి పుస్తక పఠనం, చేతిరాత, నోట్స్ రాయడం, రాత పరీక్షలు వంటి ప్రాథమిక అభ్యాస పద్ధతులను భర్తీ చేయకూడదని న్యాయస్థానం హితవు పలికింది.
గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలి. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ఇంటర్నెట్ సౌకర్యం, మరుగుదొడ్లు, తాగునీరు, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, క్రీడా సదుపాయాల మెరుగుదలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాలన్నింటిపై 8 వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఎంతో అవసరమని, భావి పౌరులను బలంగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి నిబంధనలు దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరం ఉందని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.

