శృంగారంలో సంతృప్తిగా పాల్గొన్న తర్వాత కూడా కొందరిలో అకస్మాత్తుగా తీవ్రమైన బాధ, లేదా నిరాశ తలెత్తుతుంటాయి. ఎంతో సంతోషంగా గడిపిన క్షణాల తర్వాత సదరు వ్యక్తుల్లో ఈ రకమైన unexplained sadness ఎందుకు కలుగుతుంది? అసలు దీని వెనుక ఉన్న కారణాలేంటి..?ఎలాంటి మనస్పర్థలు లేకుండా, ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొన్న తర్వాత కూడా ఒక్కసారిగా విచారం, చిరాకు లేదా ఆందోళన వంటి భావాలు కలుగుతుంటే, దానిని వైద్య పరిభాషలో 'పోస్ట్ కోయిటల్ డిస్ఫోరియా' (Postcoital Dysphoria - PCD) అంటారు. దీనినే సాధారణ భాషలో 'పోస్ట్-సెక్స్ బ్లూస్' (Post-sex blues) అని కూడా పిలుస్తారు.
పోస్ట్ కోయిటల్ డిస్ఫోరియా అంటే ఏమిటి..?
సంభోగం లేదా ఆర్గాసమ్ తర్వాత తీవ్రమైన విచారం, ఆందోళన లేదా అశాంతికి గురికావడాన్ని PCD అంటారు. భాగస్వామిపైన ప్రేమ ఉన్నప్పటికీ, శృంగారం ఎంతో సంతృప్తికరంగా సాగినప్పటికీ కొందరిలో ఈ భావోద్వేగ మార్పులు జరుగుతుంటాయి.
కొందరు ఏడుస్తుంటే, మరికొందరు తీవ్రమైన నిరాశకు గురవుతారు. ఇంకొందరు చిన్న విషయాలకే భాగస్వామితో గొడవపడే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి ఇద్దరి మధ్య అపోహలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సంబంధాలకూ దీనికి సంబంధం ఉందా..?
శృంగారం తర్వాత కలిగే ఈ విచారానికి, భాగస్వామితో ఉన్న బంధానికి ఎలాంటి సంబంధం లేదని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఎంతో అన్యోన్యంగా, ఆరోగ్యకరమైన బంధంలో ఉన్నప్పటికీ కొందరు ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. సంబంధాలలో లోపాలు ఉండటం వల్లనే ఇలా జరుగుతుందనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.

