చిన్నపిల్లల ఆరోగ్యం, పోషణ విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఆరు నెలల లోపు వయసున్న పసిపిల్లల కోసం తయారు చేసే ఆహార ఉత్పత్తుల్లో (baby food) చక్కెర కలపడాన్ని పూర్తిగా నిషేధించాలని తాజాగా ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది. పసిప్రాయం నుంచే పిల్లలకు చక్కెర అలవాటు కాకుండా చూడటం, వారి పోషకాహార భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ ముసాయిదాను రూపొందించారు.
ప్రస్తుత నిబంధనలు - తాజా మార్పులు..
ఇప్పటివరకు ఉన్న నిబంధనలు.. ప్రస్తుతం పుట్టినప్పటి నుంచి 2 ఏళ్ల (24 నెలల) లోపు చిన్నారుల ఆహార ఉత్పత్తుల తయారీలో కార్బోహైడ్రేట్ల కోసం లాక్టోజ్, గ్లూకోజ్ పాలిమర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే, నిర్దిష్ట పరిమితులు, షరతులకు లోబడి సుక్రోజ్, ఫ్రక్టోజ్ లను కూడా ఉపయోగిస్తున్నారు.
కొత్త ప్రతిపాదన..అక్టోబర్ 16, 2026న భారత గెజిట్లో ప్రచురితమైన కొత్త ముసాయిదా నిబంధనలు, శిశు పోషణ ఆహార పదార్థాల సవరణ నిబంధనలు-2026 అమలైతే, తొలి 6 నెలల వయసున్న పిల్లలకు ఇచ్చే ఆహారంలో ఈ తీపి పదార్థాల వాడకం పూర్తిగా నిలిచిపోతుంది.
చక్కెర ఎందుకు వద్దు..?
శిశువుల శారీరక, మానసిక ఎదుగుదలకు మొదటి ఆరు నెలలు అత్యంత కీలకం. ఈ దశలో వారి అవసరాలకు సరిపోయే స్వచ్ఛమైన పోషకాహారాన్ని మాత్రమే అందించాలి. చిన్న వయసులోనే అదనపు చక్కెర ఉన్న ఆహారాన్ని ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహం వంటి జీవక్రియ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆరోగ్య నిపుణులు పిల్లల ఆహారంలో తీపిని పరిమితం చేయాలని హెచ్చరిస్తుంటారు.
తల్లి పాలు మాత్రమే శ్రేయస్కరం
పుట్టినప్పటి నుంచి కనీసం ఆరు నెలల పాటు శిశువులకు కేవలం తల్లి పాలు మాత్రమే పట్టాలని వైద్యులు ఎప్పటి నుంచో సూచిస్తున్నారు. తల్లి పాల ద్వారానే బిడ్డకు కావాల్సిన పూర్తి పోషకాలు, రోగనిరోధక శక్తి అందుతాయి. తాజా ప్రతిపాదనలు కూడా శిశువులకు తల్లిపాల ఆవశ్యకతను పరోక్షంగా నొక్కి చెబుతున్నాయి.
కంపెనీల తయారీ విధానంలో మార్పులు
ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం లభిస్తే, బేబీ ఫుడ్ తయారు చేసే బహుళజాతి సంస్థలు, ఇతర కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీలో భారీ మార్పులు చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్దేశించిన కొత్త ప్రమాణాల ప్రకారమే ముడిసరుకుల ఎంపిక, నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి వస్తుంది.
ఇది తుది నిర్ణయం కాదు
ఎఫ్ఎస్ఎస్ఏఐ జారీ చేసిన ఈ సవరణ ప్రస్తుతం ముసాయిదా (Draft) దశలోనే ఉంది. దీనిపై అభ్యంతరాలు, సలహాలు ఇచ్చేందుకు సాధారణ ప్రజలు, ఆరోగ్య నిపుణులు, సంబంధిత వర్గాలకు అవకాశం కల్పించారు. గెజిట్లో ప్రచురితమైన రోజు నుంచి 60 రోజుల వ్యవధిలో తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆ తర్వాత వచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ కొత్త చట్టానికి తుది రూపునివ్వనున్నారు.


