వైద్యులు, ఆస్పత్రుల ప్రకటనల్లో కృత్రిమ మేధస్సు (AI) వినియోగంపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కీలక నిబంధనలు తీసుకొచ్చింది. AI ద్వారా పేషెంట్ టెస్టిమోనియల్స్, చికిత్స ఫలితాలు, నకిలీ ఎండార్స్మెంట్లు లేదా ప్రచార కంటెంట్ రూపొందించి వైద్య సేవలను ప్రమోట్ చేయడాన్ని నిషేధించింది. కొత్త నైతిక ప్రకటన మార్గదర్శకాలు వెంటనే అమల్లోకి వచ్చినట్లు NMC తెలిపింది.
AIతో నకిలీ టెస్టిమోనియల్స్కు నో
వైద్యులు, ఆస్పత్రులు AI ద్వారా కృత్రిమ పేషెంట్ టెస్టిమోనియల్స్, వాయిస్‌లు, క్లినికల్ ఫలితాలు లేదా ఫేక్ ఎండార్స్మెంట్లు రూపొందించి తమ సేవలను ప్రచారం చేయకూడదు. నిర్ధారించలేని వ్యాధి నిర్ధారణ, చికిత్స లేదా చికిత్స ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రచారం చేయకూడదని NMC స్పష్టం చేసింది.
‘బెస్ట్’, ‘నంబర్ వన్’ వంటి క్లెయిమ్స్ వద్దు
సెర్చ్ ఇంజిన్లు, యాప్స్‌లో తమ ర్యాంకింగ్‌ను పెంచుకునేందుకు డబ్బులు చెల్లించడం కూడా నిషేధం. అలాగే “బెస్ట్”, “నంబర్ వన్”, “మోస్ట్ ట్రస్టెడ్”, “గ్యారంటీడ్ క్యూర్”, “100% సక్సెస్” వంటి నిర్ధారణ లేని ప్రచార క్లెయిమ్స్ చేయకూడదు.
వైద్యులు లేదా ఆస్పత్రులు ఇన్ఫ్లుయెన్సర్లు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లతో పేషెంట్లను తీసుకురావడానికి చెల్లింపులు చేసే ఒప్పందాలు కూడా చేసుకోకూడదని మార్గదర్శకాల్లో పేర్కొంది.
డిస్కౌంట్లు, కూపన్లపైనా ఆంక్షలు
అనవసరమైన వైద్య సంప్రదింపులను ప్రోత్సహించే అవకాశం ఉన్న లిమిటెడ్-పీరియడ్ డిస్కౌంట్లు, కూపన్లు, గిఫ్ట్ ప్యాకేజీలు, రిఫరల్ బెనిఫిట్స్ అందించకూడదని NMC తెలిపింది.
అయితే సోషల్ మీడియాలో వైద్యులు వాస్తవ ఆధారాలతో, ప్రమోషనల్ ఉద్దేశం లేకుండా ఆరోగ్య అవగాహన సమాచారాన్ని పంచుకోవచ్చని స్పష్టం చేసింది. ఆస్పత్రులు కూడా తమ సేవలకు సంబంధించిన వాస్తవ, ఆబ్జెక్టివ్ వివరాలను వెల్లడించవచ్చు.
పేషెంట్ ఫొటోలు, ‘బిఫోర్-ఆఫ్టర్’ చిత్రాలపై నియంత్రణ
పేషెంట్ల ఫొటోలను ఉపయోగించాలంటే చెల్లుబాటు అయ్యే సమ్మతి, అవసరమైన భద్రతా చర్యలు ఉండాలని NMC పేర్కొంది. పేషెంట్ టెస్టిమోనియల్స్, బిఫోర్-ఆఫ్టర్ ఫొటోలు, చికిత్స విజయాన్ని అతిగా చూపించే ప్రచారం ద్వారా ప్రజల్లో అవాస్తవ అంచనాలు కలిగించడం లేదా తప్పుదారి పట్టించడం అనుమతించబడదు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
నిబంధనలను ఉల్లంఘించిన వారిపై దశలవారీగా చర్యలు తీసుకునేలా NMC మార్గదర్శకాలు రూపొందించింది.
మొదటి ఉల్లంఘన: హెచ్చరిక, తప్పనిసరి నైతిక శిక్షణ
రెండో ఉల్లంఘన: మందలింపు, ఆర్థిక జరిమానా
మూడో ఉల్లంఘన: 3 నుంచి 6 నెలల వరకు సస్పెన్షన్
తీవ్రమైన ఉల్లంఘనలు: 6 నుంచి 12 నెలల వరకు సస్పెన్షన్
పదేపదే ఉల్లంఘనలు: 1 నుంచి 3 సంవత్సరాల వరకు మెడికల్ రిజిస్టర్ నుంచి తొలగించే అవకాశం
ఆరోగ్య రంగంలో డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ప్రచారం పెరుగుతున్న నేపథ్యంలో AI ఆధారిత నకిలీ కంటెంట్, తప్పుదారి పట్టించే ప్రచారాన్ని నియంత్రించేందుకు ఈ మార్గదర్శకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


