డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీటిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, 'అతి సర్వత్రా వర్జయేత్' అన్నట్లు వీటిని మోతాదుకు మించి తింటే మాత్రం లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ డ్రైఫ్రూట్ అతిగా తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం..
డ్రైఫ్రూట్స్.. ప్రయోజనాలు, దుష్ప్రభావాలు..
1. బాదం (Almonds)
ప్రయోజనాలు..బాదంలో ఫైబర్, విటమిన్-ఇ మెండుగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థకు మేలు చేయడంతో పాటు, కొద్దిగా తినగానే కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.
నష్టాలు.. వీటిని అతిగా తినడం వల్ల శరీరంలో కేలరీలు పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చు. నట్స్ అలర్జీ ఉన్నవారు వైద్యుల సలహా మేరకే వీటిని తీసుకోవాలి.
2. జీడిపప్పు (Cashews)
ప్రయోజనాలు.. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో ముందుంటుంది. రాగి (కాపర్), మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఇందులో ఉంటాయి.
నష్టాలు.. జీడిపప్పులో కేలరీలు చాలా ఎక్కువ. వీటిని ఒకేసారి గుప్పెడంత తినేస్తే బరువు పెరగడం ఖాయం. కాబట్టి రోజుకు కొన్ని మాత్రమే తీసుకోవాలి.
3. ఎండు ద్రాక్ష, ఖర్జూరం (Raisins & Dates)
ప్రయోజనాలు.. నీరసంగా ఉన్నప్పుడు వెంటనే శక్తిని పుంజుకోవడానికి ఇవి చక్కటి స్నాక్స్. వీటిలో ఫైబర్ తో పాటు అనేక సూక్ష్మ పోషకాలు ఉంటాయి.
నష్టాలు..వీటిలో సహజ చక్కెరలు (Natural Sugars) అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తింటే రోజువారీ డైట్ లో చక్కెరలు, కేలరీల మోతాదు పెరిగిపోయి సమస్యలు వస్తాయి.
4. పిస్తా, మఖానా (Pistachios & Fox Nuts)
ప్రయోజనాలు..పిస్తాలో ప్రోటీన్, ఫైబర్ లభిస్తాయి. సాయంత్రం వేళ ఆకలిని తీర్చుకోవడానికి వేయించిన మఖానా ఒక అద్భుతమైన ఎంపిక.
నష్టాలు..మార్కెట్లో దొరికే ఉప్పు కలిపిన (Salted) పిస్తా పప్పుల వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. అలాగే మఖానాను ఎక్కువ నూనె లేదా నెయ్యిలో వేయించి, ఉప్పు దట్టించి తింటే అందులోని పోషకాల కంటే అనర్థాలే ఎక్కువ.
5. అంజీర్ (Figs)
ప్రయోజనాలు.. అంజీర్ లో ఫైబర్, కాల్షియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. ఎముకల దృఢత్వానికి ఇది మంచిది.
అంజీర్ ను మోతాదుకు మించి తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇందులో కూడా సహజ కేలరీలు ఎక్కువే.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు - నిపుణుల సూచనలు..
డ్రైఫ్రూట్స్ ను డైట్ లో చేర్చుకునే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి..
మిక్స్డ్ గా తినండి..
ఒకే రకమైన డ్రైఫ్రూట్ ను ఎక్కువగా తినే బదులు, అన్నింటినీ కలిపి రోజుకు ఒక గుప్పెడు (Handful) మాత్రమే తినడం ఉత్తమం.
శారీరక శ్రమ ముఖ్యం..వయసు, మీరు చేసే శారీరక శ్రమను బట్టి డ్రైఫ్రూట్స్ మోతాదు ఆధారపడి ఉంటుంది. వ్యాయామం చేయని వారు వీటిని ఇంకాస్త తక్కువగా తీసుకోవాలి.
లేబుల్స్ చదవండి.. సూపర్ మార్కెట్లో ప్యాకెట్లు కొనేటప్పుడు వెనుక ఉన్న లేబుల్స్ గమనించండి. అదనంగా ఉప్పు (Salt) లేదా చక్కెర (Sugar) కలిపిన వాటికి దూరంగా ఉండండి.
నానబెట్టి తినడం మంచిది..బాదం, ఎండు ద్రాక్ష, అంజీర్ లాంటివి రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం తినడం వల్ల సులభంగా జీర్ణమవుతాయి.

