కుటుంబంలో ఎవరికైనా మధుమేహం, క్యాన్సర్ లేదా గుండె జబ్బులు ఉన్నాయంటే ఆందోళన చెందడం సహజం, అయితే వంశపారం పర్యంగా ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నప్పటికీ సరైన ముందస్తు జాగ్రత్తలతో వాటిని నివారించవచ్చు. కేవలం జన్యువులు మాత్రమే కాకుండా, ఒకే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరి జీవనశైలి, ఆహారపు అలవాట్లు కూడా ఈ వ్యాధుల ముప్పును పెంచుతాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
క్యాన్సర్ ముప్పు (BRCA1/BRCA2)..
కుటుంబంలో ముఖ్యంగా తల్లి, సోదరి లేదా దగ్గరి బంధువుల్లో రొమ్ము, అండాశయ క్యాన్సర్ (Breast and Ovarian Cancer) చిన్న వయసులోనే వస్తే, మిగతా మహిళలు అప్రమత్తంగా ఉండాలి. BRCA1, BRCA2 జన్యువుల్లో మార్పుల వల్ల ఈ క్యాన్సర్ల ముప్పు సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. సరైన సమయంలో జెనెటిక్ కౌన్సెలింగ్, స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టవచ్చు.
మధుమేహం (Type-2 Diabetes)..
తల్లిదండ్రులు లేదా తోబుట్టువులకు టైప్-2 డయాబెటిస్ ఉంటే ఆ ప్రభావం తర్వాత తరంపై పడే అవకాశం ఉంటుంది. అయితే దీనికి కేవలం జన్యువులు మాత్రమే కారణం కాదు. శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, అనారోగ్యకరమైన ఆహారం దీనికి ఆజ్యం పోస్తాయి. బరువును నియంత్రించుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా డయాబెటిస్ బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు.
గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్..
'ఫ్యామిలియల్ హైపర్ కొలెస్ట్రోలేమియా' అనే జన్యుపరమైన సమస్య వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా చిన్న వయసులోనే గుండెపోటు రావడం లేదా తీవ్రమైన బీపీ సమస్యలు ఉంటే, మిగతావారు వెంటనే అప్రమత్తమై గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.
కుటుంబ చరిత్రలో ఇలాంటి వ్యాధులు ఉన్నవారు ముందు నుంచే అప్రమత్తంగా ఉండటం అత్యుత్తమ మార్గం. వైద్యుల సలహాతో కాలానుగుణంగా అవసరమైన హెల్త్ చెకప్‌లు చేయించుకోవడంతో పాటు, సమతుల్య ఆహారం, రోజూవారీ వ్యాయామం, ఒత్తిడి లేని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే జన్యుపరమైన ముప్పును సైతం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

