ఉరుకుల పరుగుల జీవనశైలి, శారీరక శ్రమ లోపించడం, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా నేటి సమాజంలో మధుమేహం (Diabetes) శరవేగంగా విస్తరిస్తోంది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా శరీరంలోని కీలక అవయవాలను దెబ్బతీసే గుణం ఉండటంతో దీనిని వైద్య నిపుణులు ‘సైలెంట్ కిల్లర్’గా పరిగణిస్తారు. అయితే, షుగర్ వ్యాధి వచ్చిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరైన చికిత్సతో పాటు దైనందిన అలవాట్లలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
షుగర్ నియంత్రణకు పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు.
భోజనంలో పీచు పదార్థాలు (fiber) పుష్కలంగా ఉండే తాజా కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు, పప్పుదినుసులను భాగం చేసుకోవాలి. తెల్లటి అన్నం, మైదా, పంచదార, ప్రాసెస్ చేసిన ఆహారాలు, శీతల పానీయాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. పిండి పదార్థాల (carbohydrates) పరిమాణాన్ని నియంత్రించడం చాలా అవసరం.
రోజూ శరీరానికి శ్రమ..
రోజూ వ్యాయామం చేయడం వల్ల కండరాలు గ్లూకోజ్‌ను సమర్థంగా వినియోగించుకుని, ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. వారానికి కనీసం 150 నిమిషాల పాటువేగంగా నడవడం, సైక్లింగ్, ఈత లేదా తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఆఫీసుల్లో ఎక్కువసేపు ఒకేచోట కూర్చుని పనిచేసేవారు ప్రతి గంటకోసారి లేచి కాసేపు అటూఇటూ నడవడం అలవాటు చేసుకోవాలి.
బరువు, నడుము చుట్టుకొలతపై నిఘా..
శరీరంలో అధిక బరువు, ప్రత్యేకించి పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు ఇన్సులిన్ నిరోధకతను (Insulin Resistance) పెంచుతుంది. తీవ్రమైన డైటింగ్ పద్ధతులు కాకుండా, పోషకాహారం, నిరంతర వ్యాయామంతో క్రమంగా బరువును అదుపులోకి తెచ్చుకోవాలి.
ఒత్తిడికి చెక్.. కంటినిండా నిద్ర..
మానసిక ఒత్తిడి పెరిగితే శరీరంలో కార్టిసాల్ వంటి హార్మోన్లు విడుదలై రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. దీనికితోడు నిద్రలేమి సమస్య కూడా షుగర్ లెవల్స్‌ను తారుమారు చేస్తుంది. కాబట్టి రోజుకు 7 నుంచి 8 గంటల నిరంతరాయ నిద్ర అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి రోజూ సాధన చేయాలి.
క్రమం తప్పకుండా రక్త పరీక్షలు..
కేవలం లక్షణాల ఆధారంగా కాకుండా గ్లూకోమీటర్ లేదా ల్యాబ్ ద్వారా పరగడుపున (Fasting), భోజనం తర్వాత (Post Prandial) చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. ప్రతి మూడు నెలలకోసారి సగటు చక్కెర స్థాయిని తెలిపే 'HbA1c' పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. వైద్యుల సలహా లేకుండా మందుల మోతాదును మార్చడం కానీ, సొంతంగా మందులు ఆపేయడం కానీ చేయకూడదు. డయాబెటిస్ ఉన్నవారు పాదాల సంరక్షణ, రక్తపోటు (bp), కొలెస్ట్రాల్, కంటి పరీక్షలను కూడా క్రమం తప్పకుండా చేయించుకోవాలి. నియంత్రణ మన చేతుల్లోనే ఉందన్న స్పృహతో జీవనశైలిని మార్చుకుంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించవచ్చు.

