ఇది ప్రాణాంతకమైన మెదడు గాయం. మెదడును రక్షించే బయటి పొర అంటే డ్యూరా మేటర్ కు, మెదడు ఉపరితలం మధ్య రక్తం పేరుకుపోవడాన్ని సబ్‌డ్యూరల్ హెమటోమా (Subdural Haematoma) అంటారు. అకస్మాత్తుగా వేగం పెరగడం, తగ్గడం వల్ల మెదడుకు అనుసంధానమై ఉండే సిరలు తెగిపోతాయి. ఇలా రక్తం లీక్ కావడం వల్ల పుర్రె లోపల ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఇది మెదడు కణజాలాన్ని నొక్కివేస్తుంది. ఇలాంటి సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు వెంటనే ఆపరేషన్ చేసి రక్తాన్ని, ఒత్తిడిని తొలగించాల్సి ఉంటుంది.
జీ-ఫోర్స్ (G-Force) పాత్ర ఎంతంటే..
భూమి గురుత్వాకర్షణకు సంబంధించి శరీరం అనుభవించే వేగాన్ని జీ-ఫోర్స్ అంటారు. రోలర్ కోస్టర్ ప్రయాణంలో నిటారుగా కిందకు పడిపోవడం, పదునైన మలుపులు, సడన్ బ్రేకుల వల్ల రైడర్ల శరీరంలో జీ-ఫోర్స్ తీవ్రత మారుతూ ఉంటుంది. కేవలం జీ-ఫోర్స్ మాత్రమే మెదడు గాయాలకు కారణం కాకపోయినా, తల వేగంగా అటూ ఇటూ కదలడం వల్ల రక్తస్రావం జరిగే ముప్పు పెరుగుతుంది.
2017లో జరిగిన ఒక చిన్న అధ్యయనం ప్రకారం, రోలర్ కోస్టర్ రైడ్స్ సమయంలో మెదడు కదలికలు, దానిపై పడే ఒత్తిడి.. ఫుట్‌బాల్ ఆటగాళ్లు బంతిని తలతో కొట్టినప్పుడు కలిగే ఒత్తిడితో సమానంగా ఉంటాయని తేలింది. ఆ అధ్యయనంలో తక్షణ ముప్పును గుర్తించకపోయినప్పటికీ, తాజా ఘటనలు మాత్రం ఈ ఎక్స్‌ట్రీమ్ రైడ్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.

