నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గుతోంది. ముఖ్యంగా గుండె పదిలంగా ఉండాలంటే కేవలం వ్యాయామం చేస్తే సరిపోదు. మనం రోజూ తినే ఆహారం, నిద్ర, ఒత్తిడి.. ఇలా మన దైనందిన జీవితంలో చేసే చిన్నచిన్న పనులు కూడా గుండెపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఎలాంటి మందులు అవసరం లేకుండా కేవలం మన జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం..
1. ఉదయం అల్పాహారం మానొద్దు..
చాలామంది సమయం లేక ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. పోషకాలతో కూడిన అల్పాహారంతోనే రోజును ప్రారంభించాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, ప్రొటీన్లు మీ డైట్లో ఉండేలా చూసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి.
2. గంటల తరబడి కూర్చోవద్దు..
ఆఫీసుల్లో ఒకేచోట గంటల తరబడి కూర్చుని పనిచేయడం గుండె జబ్బులకు దారితీస్తుంది. మధ్యమధ్యలో కాస్త బ్రేక్ తీసుకుని నడవాలి. ఫోన్ మాట్లాడేటప్పుడు కూర్చోకుండా అటూఇటూ నడవడం, లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కడం, సాయంత్రం వేళ వాకింగ్ చేయడం లాంటివి దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి.
3. చిరుతిళ్ల విషయంలో జాగ్రత్త..
పదే పదే ప్యాకేజ్డ్ స్నాక్స్ తినే అలవాటును మానుకోవాలి. తినే పరిమాణంపై నియంత్రణ ఉండాలి. అలాగే శరీరానికి సరిపడా నీరు తాగాలి. బీపీ, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.
4. కంటినిండా నిద్ర..
బిజీ షెడ్యూల్ వల్ల రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం పరిపాటిగా మారింది. కానీ గుండె ఆరోగ్యానికి తగినంత నిద్ర చాలా అవసరం. పడుకునే ముందు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చూడటం మానేయాలి. రోజూ ఒకే సమయానికి పడుకుని, ఒకే సమయానికి నిద్రలేచేలా అలవాటు చేసుకోవాలి.
5. ఒత్తిడికి చెక్ పెట్టండి..
ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరికీ భాగమైపోయింది. దాన్ని జయించడానికి రోజూ కాసేపు ధ్యానం (మెడిటేషన్) చేయాలి. పనుల మధ్యలో చిన్నచిన్న బ్రేకులు తీసుకుంటూ, మీకంటూ కొంత సమయం కేటాయించుకుని ప్రశాంతంగా గడపాలి.
6. పొగతాగే అలవాటుకు దూరం..
ధూమపానం, గుట్కా లాంటి పొగాకు ఉత్పత్తులు గుండె రక్తనాళాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. వీటిని పూర్తిగా మానేయడం గుండెకే కాదు, సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
7. మద్యపానానికి దూరంగా..
మోతాదుకు మించి మద్యం సేవించడం మొత్తం ఆరోగ్యానికే చేటు చేస్తుంది. గుండెను సురక్షితంగా ఉంచుకోవాలంటే మద్యపానానికి సాధ్యమైనంత దూరంగా ఉండటమే ఉత్తమ మార్గం.
గుండె ఆరోగ్యానికి ఏదో ఒక అద్భుతమైన మందు లేదా ఒకే వ్యాయామం అంటూ ఏదీ లేదు. పౌష్టికాహారం, తగినంత వ్యాయామం, కంటినిండా నిద్ర, ఒత్తిడి లేని జీవనం.. ఈ ఆరోగ్య సూత్రాలను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే గుండె పదిలంగా ఉంటుంది.

