మధుమేహం ఉన్నవారు పండ్లు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే పండ్లలోని గ్లైసెమిక్ ఇండెక్స్ (GI)రక్తంలో చక్కెరను పెంచే వేగం, గ్లైసెమిక్ లోడ్ (GL), పీచు పదార్థాన్ని బట్టి సరైన పండ్లను ఎంచుకోవడం అత్యంత ముఖ్యం. తక్కువ జీఐ ఉన్న పండ్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అకస్మాత్తుగా పెంచవు.
నిరభ్యంతరంగా తినదగిన పండ్లు.. అంటే తక్కువ GI ఉన్నవి..
ఈ పండ్లలో పీచు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి, రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. జామకాయ..తక్కువ జీఐ, అధిక ఫైబర్, విటమిన్-సి కలిగి ఉండటం వల్ల షుగర్ రోగులకు ఇది ఉత్తమ ఎంపిక. దోరగా ఉన్న జామకాయ మరింత శ్రేయస్కరం.
యాపిల్..తొక్కతో సహా తినే యాపిల్‌లోని పెక్టిన్ అనే కరిగే పీచు పదార్థం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో తోడ్పడుతుంది.
నేరేడు పండ్లు ..సంప్రదాయ వైద్యం ప్రకారం నేరేడు గింజలు, పండ్లు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి షుగర్ అదుపులో ఉండేలా చూస్తాయి. బొప్పాయి..మితమైన జీఐ ఉన్నప్పటికీ, ఇందులో ఉండే అధిక పీచు, విటమిన్ ఎ, సి వల్ల రోజూ పరిమిత పరిమాణంలో అంటే ఒక చిన్న కప్పు తీసుకోవచ్చు. నారింజ,బత్తాయి..సిట్రస్ జాతి పండ్లలోని ఫైబర్ గ్లూకోజ్ శోషణను ఆలస్యం చేస్తుంది. దానిమ్మ..యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మంచిది.
దూరంగా ఉండాల్సిన పండ్లు అంటే అధిక GI ఉన్నవి..
ఈ పండ్లలో సహజ చక్కెరలు ఫ్రక్టోజ్,గ్లూకోజ్ అధికంగా ఉండి, తిన్న వెంటనే బ్లడ్ షుగర్ స్పైక్స్ కలిగిస్తాయి. మామిడి పండు.. కేలరీలు, పిండిపదార్థం చాలా ఎక్కువ. పూర్తిగా పండిన మామిడి పండ్లను వీలైనంత వరకు నివారించాలి లేదా అతి తక్కువ పరిమాణానికే పరిమితం చేయాలి. అరటిపండు.. ముఖ్యంగా బాగా పండిన అరటిపండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికం. సపోటా..తియ్యదనం, పిండిపదార్థం అధికంగా ఉండే పండు. తిన్న వెంటనే గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి.
ద్రాక్ష..చిన్న పండ్లే అయినప్పటికీ సాధారణంగా వీటిని ఎక్కువ మొత్తంలో తినేస్తుంటారు, ఇది షుగర్ పెరగడానికి కారణమవుతుంది.
పుచ్చకాయ..నీటి శాతం ఎక్కువే అయినా, దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ ..సుమారు 72. డ్రై ఫ్రూట్స్..కిస్మిస్, ఖర్జూరాలు, అంజీరాలలో చక్కెర సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది.
మధుమేహులు పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు..
పండ్ల రసాలు అస్సలు వద్దు: పండును రసంగా తీసినప్పుడు పీచు తొలగిపోయి చక్కెర నేరుగా రక్తంలో కలుస్తుంది. ఎప్పుడూ నమిలి ముక్కలుగానే తినాలి.
భోజనంతో పాటు వద్దు.. భోజనం చేసిన వెంటనే లేదా భోజనంతో కలిపి పండ్లు తినకూడదు. ఉదయం 11 గంటల సమయంలో లేదా సాయంత్రం వేళల్లో మిడ్-మీల్ స్నాక్‌గా తీసుకోవడం శ్రేయస్కరం.
పరిమాణం ముఖ్యం (Portion Control)..తక్కువ జీఐ ఉన్న పండ్లయినా ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా, రోజుకు సుమారు 100 నుండి 150 గ్రాములకు మించకుండా చూసుకోవాలి.

