బియ్యం మన ప్రధాన ఆహారం అయినప్పటికీ, అధిక బరువు, మధుమేహం ఉన్నవారు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే తెల్ల బియ్యాన్ని తగ్గించాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే, పాలిష్ చేయని బ్రౌన్ రైస్ అంటే ముడి బియ్యం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
తెల్ల బియ్యం కంటే ఎందుకు మేలు..?
తెల్ల బియ్యాన్ని పాలిష్ చేయడం వల్ల రుచి, నిల్వ ఉండే కాలం పెరిగినా అందులోని పోషకాలు నశిస్తాయి. బ్రౌన్ రైస్ పూర్తి ధాన్యం కావడం వల్ల ఇందులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చక్కటి ప్రత్యామ్నాయం.
గుండె ఆరోగ్యానికి రక్ష..
బ్రౌన్ రైస్ లాంటి తృణధాన్యాలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరిచి గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్-2 మధుమేహం, ఊబకాయం ముప్పును తగ్గిస్తాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది.
ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, లిగ్నన్స్, డైటరీ ఫైబర్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
గ్లూటెన్ ఫ్రీ ఆహారం..
గోధుమలు, బార్లీ వంటి ధాన్యాల్లో ఉండే 'గ్లూటెన్' అనే ప్రోటీన్ వల్ల కొందరికి కడుపునొప్పి, విరేచనాలు, వాపు వంటి అలెర్జీ సమస్యలు వస్తాయి.
బ్రౌన్ రైస్ గ్లూటెన్ రహితమైనది కావడంతో ఎవరైనా నిశ్చింతగా తీసుకోవచ్చు. ఆటోఇమ్యూన్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ ఇది తోడ్పడుతుంది.
బరువు నియంత్రణ..
ఒక కప్పు (158 గ్రాములు) బ్రౌన్ రైస్‌లో 3.5 గ్రాముల ఫైబర్ ఉంటే, తెల్ల బియ్యంలో 1 గ్రాము కంటే తక్కువే ఉంటుంది.
పీచు పదార్థం (fiber) అధికంగా ఉండటం వల్ల కొద్దిగా తిన్నా ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. పదే పదే ఆకలి వేయదు, తద్వారా సులభంగా బరువు నియంత్రణలో ఉంటుంది.

