దానిమ్మ పండు కేవలం అద్భుతమైన రుచిని మాత్రమే కాదు, అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఎర్రగా నిగనిగలాడే ఈ గింజల్లో ఫైబర్, విటమిన్-సి, శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా వందల ఏళ్లుగా దానిమ్మ గింజలు, రసం, తొక్కలను పలు రకాల అనారోగ్య సమస్యల చికిత్సలో వినియోగిస్తున్నారు. దానిమ్మను రోజూవారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ప్రధాన లాభాలు, ఉపయోగించే విధానాలు తెలుసుకుందాం.
దానిమ్మతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
దానిమ్మ గింజల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు సాయపడుతుంది. ఆకలి మందగించడం, జీర్ణ సమస్యలతో బాధపడేవారు దానిమ్మ రసంలో కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, సైంధవ లవణం (Rock Salt) కలిపి తీసుకుంటే మంచిదని ఆయుర్వేదం చెబుతోంది.ఈ పండులో 'పాలీఫెనాల్స్' అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని (Oxidative Stress) తగ్గించి, కణాలకు నష్టం జరగకుండా కాపాడతాయి.
చర్మం నిగారింపు..
దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం నిగారింపును పెంచుతాయి. ఆయుర్వేదంలో చర్మ సౌందర్యం కోసం దానిమ్మ తొక్కల పొడిని లేపనంగా వాడతారు. గమనిక..సున్నితమైన చర్మం ఉన్నవారు ముఖానికి ఏదైనా ప్యాక్ వేసుకునే ముందు తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. దానిమ్మలో విటమిన్-సి పుష్కలంగా లభిస్తుంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను తట్టుకోవడానికి, రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటానికి ఇది చాలా అవసరం.
దానిమ్మలోని పాలీఫెనాల్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని పలు పరిశోధనల్లో తేలింది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ముందుజాగ్రత్తగా తీసుకునే సమతుల్య ఆహారంలో దీన్ని చేర్చుకోవచ్చు.
గర్భిణులకు ప్రయోజనకరమేనా..?
గర్భధారణ సమయంలో మహిళలు తరచుగా నీరసానికి గురవుతుంటారు. ఆ సమయంలో తక్షణ శక్తి కోసం దానిమ్మ రసం తాగడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. అయితే, గర్భిణులు ఏ ఆహారాన్నైనా నిర్ణీత మోతాదులో తీసుకోవాలి కాబట్టి, వైద్యులు లేదా డైటీషియన్ సలహా మేరకు దీన్ని ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం.
ఎలా తినడం మంచిది..?
దానిమ్మను జ్యూస్ చేసుకుని తాగడం కంటే నేరుగా గింజలను తినడమే అత్యుత్తమ విధానం. జ్యూస్ చేయడం వల్ల అందులోని పీచు పదార్థం (fiber) వృథా అవుతుంది. వీటిని నేరుగా తినలేని వారు.. ఓట్స్, సలాడ్స్, ఫ్రూట్ బౌల్స్ లేదా పెరుగులో కలుపుకుని కూడా ఆస్వాదించవచ్చు.
ఇవన్నీ ఆయుర్వేదం, సంప్రదాయ వైద్యం ఆధారంగా సూచించిన గృహ చిట్కాలు మాత్రమే. వీటిని ఏ జబ్బుకూ ప్రత్యామ్నాయంగా లేదా శాశ్వత చికిత్సగా భావించకూడదు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణులు, చిన్నపిల్లలు ఏదైనా కొత్త చిట్కా పాటించే ముందు తమ వైద్యుడిని సంప్రదించాలి.

