రాత్రిపూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా పిక్కల్లో తీవ్రమైన నొప్పి, కండరాలు బిగుసుకు పోవడం (leg cramps) చాలామందిని వేధించే సాధారణ సమస్య. కొద్ది నిమిషాల పాటు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించే ఈ సమస్య ఎప్పుడో ఒకసారి వస్తే పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. కానీ తరచూ పునరావృతమవుతుంటే మాత్రం శరీరంలో కీలక పోషకాల లోపాలు, నిర్జలీకరణం (dehydration) లేదా ఇతర అంతర్గత ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకు వస్తాయి..? ప్రధాన కారణాలు..
పోషకాలు, ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత.. కండరాలు సక్రమంగా సంకోచ వ్యాకోచాలు చెందడానికి, నరాల పనితీరుకు మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు అత్యంత అవసరం. వీటిలో ఏది తగ్గినా కండరాలు పట్టేసే ప్రమాదం పెరుగుతుంది.
నీటి కొరత (dehydration)..శరీరంలో తగినంత నీరు లేకపోవడం, ఎండ తీవ్రత లేదా వ్యాయామం వల్ల ఎక్కువగా చెమట పట్టడం వల్ల ఎలక్ట్రోలైట్ స్థాయిలు పడిపోయి క్రాంప్స్ వస్తాయి.
శారీరక శ్రమ, ఒకే భంగిమ.. ఎక్కువ దూరం నడవడం, మితిమీరిన వ్యాయామం లేదా ఒకే స్థితిలో గంటల తరబడి కూర్చోవడం వల్ల కండరాలపై ఒత్తిడి పెరిగి బిగుసుకుపోతాయి.
మందుల ప్రభావం,నరాల సమస్యలు..కొన్ని రకాల రక్తపోటు మందులు, కొలెస్ట్రాల్ మందులు లేదా నాడీ వ్యవస్థకు సంబంధించిన లోపాలు కూడా దీనికి దోహదం చేయవచ్చు.
ఆహారంలో ఏం తీసుకోవాలి..?
మెగ్నీషియం..పాలకూర వంటి ఆకుకూరలు, పప్పుధాన్యాలు, గింజలు (seeds), బాదం, జీడిపప్పు, తృణధాన్యాలు.
పొటాషియం..అరటిపండ్లు, కొబ్బరి నీళ్లు, నారింజ, చిలగడదుంపలు, పప్పులు.
కాల్షియం..పాలు, పెరుగు, పనీర్, నువ్వులు, రాగులు.
ద్రవాహారం..రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల నీటిని తప్పక తాగాలి.
క్రాంప్ వచ్చినప్పుడు తక్షణమే ఏం చేయాలి..?
నొప్పి వచ్చిన కండరాన్ని వెంటనే సున్నితంగా వ్యాయామంలా స్ట్రెచ్ చేయాలి. పాదాన్ని ముందుకు కాకుండా మీ వైపునకు లాగడం వల్ల పిక్క కండరం త్వరగా రిలాక్స్ అవుతుంది.
ఆ ప్రాంతంలో చేతులతో నెమ్మదిగా మసాజ్ చేయాలి.
రక్తప్రసరణ మెరుగుపడేందుకు గోరువెచ్చని నీటి కాపడం పెట్టవచ్చు.
రోజువారీ వ్యాయామం చేసేవారు ముందుగా వార్మప్, ముగింపులో స్ట్రెచింగ్ చేయడం మరిచిపోవద్దు.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?
కాళ్లలో క్రాంప్స్ నిత్యకృత్యమై నిద్ర చెడిపోతున్నా, నొప్పితో పాటు కాళ్లలో వాపు, తిమ్మిర్లు, స్పర్శ కోల్పోవడం, చర్మం రంగు మారడం లేదా విపరీతమైన నీరసం వంటివి కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. సొంతంగా విటమిన్ మాత్రలు వేసుకోకుండా, నిపుణులైన వైద్యులను సంప్రదించి రక్త పరీక్షల ద్వారా అసలు కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.

