మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా కిడ్నీ (kidney diseases) వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిలో ఈ ముప్పు పొంచి ఉంటోంది. ముఖ్యంగా, కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ సమస్యలు, అధిక రక్తపోటు (bp) లేదా మధుమేహం (షుగర్) ఉన్నట్లయితే, ఆ కుటుంబంలోని మిగతా సభ్యులు తమ ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జన్యుపరమైన ముప్పు ఉంటుందా..?
కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కిడ్నీ సమస్య ఉన్నంత మాత్రాన కచ్చితంగా మీకూ వస్తుందని కాదు. కానీ, ఇతరులతో పోలిస్తే మీకు ఆ ముప్పు ఎక్కువగా ఉంటుంది. 'పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ (PKD)' లాంటి కొన్ని రకాల వ్యాధులు జన్యుపరమైన మార్పుల వల్ల వంశపారంపర్యంగా వస్తాయి. కిడ్నీ వ్యాధులు తొలిదశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలను చూపించవు. లోపల వ్యాధి తీవ్రమవుతున్నా బయటకు తెలియదు. కాబట్టి, కుటుంబ నేపథ్యం ఉన్నవారు ముందస్తుగా వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం.
కిడ్నీల పనితీరు తెలుసుకోవడానికి ముఖ్యమైన పరీక్షలు..
క్రియాటినిన్ (Blood Creatinine).. రక్తంలో క్రియాటినిన్ స్థాయిని బట్టి ఈజీఎఫ్ఆర్ (eGFR)ను అంచనా వేస్తారు. దీనిద్వారా కిడ్నీలు రక్తాన్ని ఎంత సమర్థవంతంగా ఫిల్టర్ చేస్తున్నాయో వైద్యులు తెలుసుకుంటారు.
యూరిన్ ఆల్బుమిన్ (UACR)..మూత్రంలో ఆల్బుమిన్ అనే ప్రొటీన్ ఎంత మేర పోతోందో ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. కిడ్నీ వ్యాధి ప్రారంభ దశను గుర్తించడానికి ఇది చాలా కీలకం. బీపీ, షుగర్ పరీక్షలు..అధిక రక్తపోటు, మధుమేహం నేరుగా కిడ్నీలను దెబ్బతీస్తాయి. కాబట్టి వీటి స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.
కిడ్నీల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
రోజువారీ ఆహారంలో ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. చిన్నచిన్న నొప్పులకే పదేపదే పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు. ఇవి కిడ్నీల పనితీరుపై తీవ్రమైన అదనపు భారాన్ని మోపుతాయి. బీపీ, డయాబెటిస్ ఉన్నవారు వాటిని ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి.


