ఎముకలు, దంతాల దృఢత్వానికి కాల్షియం ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే! అంతేకాదు.. కండరాల ఆరోగ్యానికి, నరాల ద్వారా సంకేతాలు చేరవేయడానికి, రక్తం గడ్డకట్టే ప్రక్రియలో కూడా కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, చాలామంది కాల్షియం ఉన్న ఆహారం తగినంత తీసుకుంటున్నప్పటికీ వారి శరీరానికి ఆ ప్రయోజనం అందదు. దీనికి కారణం.. విటమిన్-డి లోపం, మన ఆహారపు అలవాట్లు, శరీరం పోషకాలను సరిగ్గా గ్రహించలేకపోవడమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు.
మనం రోజూ తీసుకునే కొన్ని రకాల పదార్థాలు.. శరీరంలోని కాల్షియంను ఎలా హరించేస్తున్నాయో, ఎముకల ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
విటమిన్-డి ఉంటేనే..
ఎముకలు దృఢంగా ఉండాలంటే కేవలం కాల్షియం ఉన్న ఆహారం తీసుకోవడం మాత్రమే సరిపోదు. ఆ కాల్షియం శరీరానికి వంటబట్టాలంటే (Absorption) విటమిన్-డి తప్పనిసరి. మీరు ఎంత కాల్షియం ఉన్న ఆహారం తిన్నా.. విటమిన్-డి లోపం ఉంటే శరీరం ఆ కాల్షియంను గ్రహించలేదు.
ఉదయం పూట ఎండలో నిలబడటం వల్ల శరీరానికి విటమిన్-డి సహజంగా అందుతుంది.
పాలు, గుడ్లు, పుట్టగొడుగులు వంటి ఆహార పదార్థాల ద్వారా కూడా కొంతమేర పొందవచ్చు. ఒకవేళ విటమిన్-డి లోపం తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించి సప్లిమెంట్లు వాడటం మంచిది.
ఉప్పు మోతాదు మించితే.. కాల్షియం ఆవిరే..!
భోజనంలో ఉప్పు ఎక్కువగా తింటున్నారా? అయితే అది మీ ఎముకల పాలిట శాపమే! ఎక్కువ మోతాదులో సోడియం (salt) తీసుకోవడం వల్ల.. మూత్రం ద్వారా శరీరంలోని కాల్షియం ఎక్కువగా బయటకు వెళ్లిపోతుంది.
చిప్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, నిల్వ పచ్చళ్లు, బేకింగ్ సోడా వాడే పదార్థాలను మితంగా తీసుకోవాలి.
అదేవిధంగా.. కెఫిన్ (కాఫీ, టీలు) ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కాల్షియం శోషణ సామర్థ్యం (Absorption) దెబ్బతింటుంది.
ఈ అలవాట్లకు దూరంగా..
పొగతాగడం, మితిమీరిన మద్యం సేవించడం ఎముకల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ అలవాట్లు ఎముకల నిర్మాణ ప్రక్రియను దెబ్బతీసి, కాలక్రమేణా ఎముకలు పెళుసుబారేలా (ఆస్టియోపోరోసిస్) చేస్తాయి. దానికి తోడు కాల్షియం, విటమిన్-డి లోపం కూడా ఉంటే ముప్పు మరింత పెరుగుతుంది. కాబట్టి ఈ దురలవాట్లకు దూరంగా ఉండటం అత్యవసరం.
కాల్షియం కోసం ఏం తినాలి..?
కాల్షియం లోపం తలెత్తడానికి ప్రధాన కారణం.. మన రోజువారీ డైట్లో కాల్షియం అధికంగా ఉండే పదార్థాలు లేకపోవడమే.
పాలు, పెరుగు, పన్నీర్, సోయా, నువ్వులు, ఆకుకూరలు తోటకూర, బచ్చలి తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి.
శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందేలా సమతులాహారం (Balanced Diet) తీసుకోవాలి. దీనితో పాటు రోజూ క్రమం తప్పకుండా నడక, వైద్యుల సలహా మేరకు తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.


