మధుమేహం (diabetes) బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకపోతే గుండె, మూత్రపిండాలు, కళ్లు, నరాలపైనే కాదు.. దంతాలు, చిగుళ్లపైనా తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది నోటి నుంచి దుర్వాసన రావడం, చిగుళ్ల నుంచి రక్తం కారడం లాంటి వాటిని సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, డయాబెటిస్ ఉన్నవారిలో ఇవి తీవ్రమైన దంత సమస్యలకు సంకేతాలు కావొచ్చు.
దంతాలు, చిగుళ్లపై మధుమేహం ప్రభావం..?
చిగుళ్ల వ్యాధులు (Gum Infections)..రక్తంలో చక్కెర స్థాయిలు దీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉంటే చిగుళ్లలో ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. బ్రష్ చేసుకునేటప్పుడు రక్తం రావడం, చిగుళ్లు వాపు, ఎర్రబడటం లాంటివి కనిపిస్తాయి. దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే 'పెరియోడాంటైటిస్' (Periodontitis) అనే తీవ్రమైన చిగుళ్ల వ్యాధికి దారితీస్తుంది.
దంత క్షయం (Cavities)..షుగర్ లెవల్స్ అదుపు తప్పితే, లాలాజలంలోనూ (Saliva) గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల నోట్లో హానికరమైన బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఈ బ్యాక్టీరియా ఆమ్లాలను (acids) ఉత్పత్తి చేసి దంతాల పైపొరను దెబ్బతీస్తుంది. ఫలితంగా పళ్లు పుచ్చిపోతాయి (cavities).
నోరు పొడిబారడం, ఫంగల్ ఇన్ఫెక్షన్లు..డయాబెటిస్ ఉన్నవారిలో, అలాగే వారు వాడే కొన్ని మందుల వల్ల నోట్లో లాలాజల ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల నోరు పొడిబారడం, నోటి పూత లాంటివి ఇబ్బంది పెడతాయి. అలాగే 'ఓరల్ థ్రష్' (Oral thrush) అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. నోట్లో, పెదవులపై తెల్లటి మచ్చలు ఏర్పడి నొప్పిగా ఉంటుంది.
పళ్లు రాలిపోయే ప్రమాదం: మధుమేహం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి, గాయాలు మానే వేగం తగ్గుతాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి క్షీణించడం వల్ల చిగుళ్ల సమస్యలు తీవ్రమై దంతాలు వదులుగా మారిపోతాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే పళ్లు రాలిపోయే ప్రమాదం ఉంటుంది.
రక్షణ ఎలా మరి..?
మధుమేహ బాధితులు కేవలం ఆహార నియమాలు, మందులకే పరిమితం కాకుండా నోటి శుభ్రతపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
రోజుకు రెండుసార్లు ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌తో పళ్లు తోముకోవాలి.
డైలీ దంతాల మధ్య ఫ్లాసింగ్ చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవాలి.
చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నా, పంటి నొప్పి లేదా నోటి దుర్వాసన వేధిస్తున్నా వెంటనే దంత వైద్యుడిని సంప్రదించాలి. క్రమం తప్పకుండా డెంటల్ చెకప్ చేయించుకోవడం మంచిది.


