ఉదయం నిద్రలేవగానే మనం చేసే పనులు ఆ రోజంతా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. చాలామంది ఉదయం మెలకువ రాగానే హడావుడిగా మంచం మీద నుంచి ఒక్కసారిగా పైకి లేస్తుంటారు. ఇది చాలా చిన్న విషయంగా అనిపించినా.. గుండె ఆరోగ్యానికి, ముఖ్యంగా ముందే బీపీ, గుండె సమస్యలు ఉన్నవారికి ఇది ప్రమాదకరంగా మారొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అకస్మాత్తుగా పైకి లేవడం ఎందుకు ప్రమాదకరం?
రాత్రంతా పడుకుని విశ్రాంతి తీసుకున్న తర్వాత ఒక్కసారిగా నిల్చున్నప్పుడు, శరీరంలో రక్త ప్రసరణకు సంబంధించి అకస్మాత్తుగా మార్పులు జరుగుతాయి. ఒక్కసారిగా పైకి లేవడం వల్ల రక్తపోటు (బీపీ) తాత్కాలికంగా పడిపోతుంది. దీన్ని వైద్య పరిభాషలో 'ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్' (Orthostatic Hypotension) అంటారు.
దీనివల్ల కనిపించే సమస్యలు:
అకస్మాత్తుగా కళ్లు తిరగడం
కళ్ల ముందు చీకట్లు కమ్మడం
తీవ్రమైన నీరసం లేదా ఆందోళనగా అనిపించడం
బ్యాలెన్స్ తప్పి కింద పడిపోవడం లేదా సృహ కోల్పోవడం
అకస్మాత్తుగా మంచం మీద నుంచి లేవడం నేరుగా హార్ట్ ఎటాక్‌కు (గుండెపోటుకు) దారితీయకపోయినా.. అప్పటికే గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు లేదా లో-బీపీ ఉన్నవారికి మాత్రం ఇది తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుంది.
ఉదయం నిద్ర లేచే సరైన విధానం ఏంటి?
గుండెతో పాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉదయం నిద్రలేచేటప్పుడు ఈ కింది చిన్నపాటి జాగ్రత్తలు పాటించాలి:
మెలకువ రాగానే వెంటనే మంచం దిగి నిల్చోవద్దు.
ముందుగా మంచంపై కొన్ని నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చోవాలి. శరీరాన్ని సాధారణ స్థితికి రానివ్వాలి.
ఆ తర్వాత నెమ్మదిగా కాళ్లను కిందకు దించాలి.
ఒకవేళ లేవగానే కళ్లు తిరిగినట్లు లేదా నీరసంగా అనిపిస్తే.. వెంటనే మళ్లీ కూర్చోవాలి.
బీపీ సమస్యలు ఉన్నవారు రక్తపోటును క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవాలి.
ఒకవేళ తరచూ ఇలా కళ్లు తిరగడం లేదా సృహ తప్పడం లాంటివి జరుగుతుంటే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.


