పొట్ట చుట్టూ కొవ్వు (Belly fat) పేరుకుపోవడం ఆరోగ్యానికి తీవ్ర ముప్పు. ఇది కేవలం పెద్ద వయసు వారికే కాదు, నేడు యువత, పిల్లల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. రోజూ క్రమం తప్పకుండా జిమ్‌కి వెళ్లి, ట్రెడ్‌మిల్‌పై గంటల తరబడి చెమటోడ్చి, వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నా పొట్ట తగ్గడం లేదా? ఇంత కష్టపడినా బరువు ఎందుకు తగ్గట్లేదన్న సందేహం మిమ్మల్ని వేధిస్తోందా? చాలామంది దీనికి కారణం జీవక్రియ (Metabolism) మందగించడమే అని అపోహ పడుతుంటారు. కానీ, బరువు తగ్గకపోవడానికి అసలు కారణాలు వేరే ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
డైట్‌లో లోపాల వల్లే 'క్యాలరీ సర్ ప్లస్'..
జిమ్‌లో ఎంత కష్టపడినా పొట్ట దగ్గరి కొవ్వు కరగకపోవడానికి ప్రధాన కారణం తీసుకునే ఆహారమే. బరువు తగ్గాలంటే మనం తీసుకునే క్యాలరీల కంటే ఖర్చు చేసే క్యాలరీలు ఎక్కువగా ఉండాలి. దీనినే క్యాలరీ డెఫిసిట్ అంటారు. మీరు వ్యాయామం ద్వారా బర్న్ చేస్తున్న క్యాలరీల కంటే, రోజంతా ఆహారం ద్వారా తీసుకునే క్యాలరీలు క్యాలరీ సర్ ప్లస్ ఎక్కువగా ఉంటే బరువు తగ్గడం అసాధ్యం.
'హెల్తీ ఫుడ్' పేరుతో క్యాలరీలు పెంచేస్తున్నారా..?
జిమ్‌కి వెళ్లేవారు వర్కౌట్ తర్వాత ప్రోటీన్ షేక్స్, పీనట్ బటర్, డ్రై ఫ్రూట్స్, స్మూతీలు, ఎనర్జీ బార్స్ వంటివి తీసుకుంటుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.. వీటిలో క్యాలరీలు అత్యధికంగా ఉంటాయి. ముఖ్యంగా నట్స్‌ను పౌష్టికాహారం కదా అని పరిమితికి మించి తీసుకుంటే క్యాలరీలు పెరిగిపోయి బరువు తగ్గడానికి ఆటంకంగా మారుతుంది. అందుకే వర్కౌట్‌తో పాటు డైట్‌పై కూడా తీవ్రమైన దృష్టి పెట్టాలి.
వ్యాయామం విషయంలో అపోహలు వద్దు..
కేవలం క్రంచెస్, ప్లాంక్స్ వంటివి చేయడం వల్ల పొట్ట కండరాలు దృఢపడతాయే తప్ప, పొట్ట దగ్గరి కొవ్వు మాత్రమే కరగదు. శరీరంలో కొవ్వు కరిగే ప్రక్రియ (ఫ్యాట్ లాస్) అనేది మొత్తం శరీరంపై ఒకేలా జరుగుతుంది. అందుకే కేవలం ఒకే రకమైన వ్యాయామం కాకుండా, సమతుల్యమైన వ్యాయామాలను ఎంచుకోవాలి.
బరువు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి..
రోజూ తీసుకునే ఆహారం, తినే పరిమాణం (Portion control)పై ఓ కన్నేసి ఉంచండి.
మీ భోజనంలో ప్రోటీన్, ఫైబర్, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి.
చక్కెరతో కూడిన పానీయాలు, అధిక క్యాలరీలు ఉండే స్నాక్స్‌ను పూర్తిగా తగ్గించండి.
కార్డియోతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేయండి. కేవలం జిమ్ సమయానికే పరిమితం కాకుండా రోజంతా చురుకుగా ఉంటూ నడకను అలవాటు చేసుకోండి.
తరచుగా బరువుతో పాటు మీ నడుము చుట్టుకొలతను కూడా కొలుచుకుంటూ పురోగతిని చెక్ చేసుకోండి.


