గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ దగ్గరి నుంచి సాయంత్రం స్నాక్స్ వరకు చాలామంది బాదం, వేరుశెనగలు తినడానికి ఇష్టపడతారు. ఈ రెండు గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే అయినప్పటికీ.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) కరిగించే విషయంలో ఒకదానిదే పైచేయి. ఆ రెండింటిలో గుండె ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరమో ఇప్పుడు చూద్దాం..
బాదం ఎందుకు ప్రత్యేకం..?
బాదంపప్పులో మంచి కొవ్వులు (Healthy Fats), పీచు పదార్థం (fiber) అధికంగా ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్ (healthy fats) చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు(bad cholesterol) త్వరగా అదుపులోకి వస్తాయి. అంతేకాకుండా, పేగుల్లో కొలెస్ట్రాల్(cholesterol) శోషణను నెమ్మదింపజేసే కొన్ని సహజ మూలకాలు బాదంలో ఉంటాయి. అందుకే గుండె ఆరోగ్యానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
వేరుశెనగ కూడా తక్కువేం కాదు..!
పల్లీలు తినడం వల్ల కూడా గుండెకు మేలు జరుగుతుంది. ఇందులోనూ కొలెస్ట్రాల్(cholesterol)ను నియంత్రించే మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కాకపోతే పోషకాల పరంగా బాదంతో పోలిస్తే కాస్త వెనుకబడి ఉంటుంది.
పోషకాల పోలిక (28 గ్రాములలో..)
బాదం..13.07 గ్రాముల అన్‌శాచురేటెడ్ ఫ్యాట్ అంటే మంచి కొవ్వు, 1.16 గ్రాముల సాచురేటెడ్ ఫ్యాట్ అంటే చెడు కొవ్వు, 3.1 గ్రాముల ఫైబర్ ఉంటాయి.
వేరుశెనగ..10.2 గ్రాముల అన్‌శాచురేటెడ్ ఫ్యాట్, 2.19 గ్రాముల సాచురేటెడ్ ఫ్యాట్, 2.4 గ్రాముల ఫైబర్ లభిస్తాయి.
ఈ గణాంకాలను బట్టి చూస్తే, ఫైబర్, మంచి కొవ్వులు బాదంలోనే కాస్త ఎక్కువగా ఉన్నాయని అర్థమవుతోంది.
బరువు తగ్గాలనుకునే వారికి ఏది మేలు..?
బరువు అదుపులో ఉంచుకోవడంతో పాటు, కొలెస్ట్రాల్ తగ్గాలనుకునేవారు బాదంను ఎంచుకోవడం ఉత్తమ ప్రత్యామ్నాయం. అయితే, పల్లీలు కూడా నిరభ్యంతరంగా తినొచ్చు. కానీ ఏది తిన్నా మితంగా తినడం ముఖ్యం. నూనెలో వేయించినవి, ఉప్పు లేదా చక్కెర పూత పూసినవి కాకుండా.. సాధారణ పచ్చి గింజలు లేదా నానబెట్టినవి తినడం ఆరోగ్యానికి మంచిది.
కొలెస్ట్రాల్ కంట్రోల్ కోసం పాటించాల్సిన ఇతర జాగ్రత్తలు..
కేవలం బాదం, పల్లీలు తిన్నంత మాత్రాన కొలెస్ట్రాల్ తగ్గిపోదు. దైనందిన జీవనశైలిలో ఈ క్రింది మార్పులు తప్పనిసరి..
మీ రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, ఆకుకూరలు ఉండేలా చూసుకోండి.
మైదాకు బదులుగా తృణధాన్యాలు , పొట్టుతీయని పప్పు దినుసులు ఎక్కువగా తీసుకోండి.
నూనెలో డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, జంక్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండాలి.
రోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి.
రోజూ 7-8 గంటల పాటు కంటినిండా నిద్రపోవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
కొలెస్ట్రాల్ స్థాయిలు మరీ ఎక్కువగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలి.


