రాత్రి పూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఛాతీ, గొంతులో మంటతో మెలకువ వస్తుంటుంది. ఇలాంటి సమయంలో చాలామంది చల్లటి పాలు లేదా పిప్పర్‌మెంట్ టీ తాగుతుంటారు. అయితే, ఇవి కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. అసలు గొంతు మంట ఎందుకు వస్తుంది? దానికి వెనక ఉన్న కారణాలు, శాశ్వత పరిష్కారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మంటకు అసలు కారణం ఏంటి..?
గొంతు, ఛాతీలో వచ్చే ఈ మంటను వైద్య పరిభాషలో 'జీఈఆర్‌డీ' (GERD అంటే గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటారు. దీనికి కారణం కేవలం కడుపులోని ఆమ్లాలే (acid) కాదు, 'పెప్సిన్' (Pepsin) అనే జీర్ణ ఎంజైమ్ కూడా! ఆహారాన్ని జీర్ణం చేయడంలో సాయపడే ఈ ఎంజైమ్, కడుపులో నుంచి గొంతులోకి వెనక్కి వచ్చినప్పుడు అక్కడి సున్నితమైన కణజాలాలను దెబ్బతీసి తీవ్రమైన మంటను పుట్టిస్తుంది.
మంటగా ఉన్న సమయంలో ఏదైనా ఆమ్ల (Acidic) గుణాలున్న ఆహారం తీసుకుంటే గొంతులో అప్పటికే ఉన్న పెప్సిన్ మళ్లీ యాక్టివ్ అయిపోయి సమస్య మరింత తీవ్రమవుతుంది.
పాలు, పిప్పర్‌మెంట్... ఒక అపోహ మాత్రమే..!
చల్లటి పాలు తాగితే ఎసిడిటీ నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుందనేది ఒక అపోహ మాత్రమే. పాలు తాగిన ఐదు నిమిషాల పాటు మాత్రమే కడుపులో చల్లగా అనిపిస్తుంది. ఆ తర్వాత అది జీర్ణం కావడానికి కడుపులో మళ్లీ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఇక పిప్పర్‌మెంట్ టీ తాగిన కొద్దిసేపు బాగానే ఉన్నా, అది అన్నవాహిక కండరాలను సడలించి కడుపులోని యాసిడ్ మళ్లీ పైకి (గొంతులోకి) వచ్చేలా చేస్తుంది.
పీహెచ్ (pH) స్థాయితోనే అసలైన ఉపశమనం..
గొంతు, ఛాతీ మంటగా ఉన్నప్పుడు కేవలం సాధారణ నీళ్లు తాగితే పూర్తి ప్రయోజనం ఉండదు. పీహెచ్ (pH) స్థాయి కనీసం 8.8 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ద్రవాలు తీసుకోవడం వల్ల లాభం ఉంటుంది.
ఇది గొంతులోని కణజాలాలతో పెప్సిన్‌కు ఉన్న సంబంధాన్ని తెంచేస్తుంది. ఈ ఎంజైమ్‌ను శాశ్వతంగా తటస్థీకరిస్తుంది (Neutralize).
కడుపులో ఆమ్లాల సమతుల్యతను కాపాడుతుంది.
మంటను తగ్గించే న్యాచురల్ ఫుడ్స్..
ఆల్కలైన్ వాటర్..ఇది పెప్సిన్ ప్రభావాన్ని నాశనం చేసి, యాసిడ్‌ను తటస్థీకరిస్తుంది.
అరటిపండులో సహజసిద్ధమైన యాంటాసిడ్ గుణాలు ఉంటాయి. ఇది కడుపు లోపలి పొరను రక్షిస్తూ ఒక పూతలా ఏర్పడుతుంది. బాగా పండిన అరటిపండు మాత్రమే తీసుకోవాలి. కర్బూజ (Melon)..ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండి, పీహెచ్ (pH) స్థాయి అధికంగా ఉంటుంది. ఇది కడుపులోని యాసిడ్ తీవ్రతను వెంటనే తగ్గిస్తుంది.
ఓట్స్..ఓట్స్‌లో 'బీటా-గ్లూకాన్' అనే ఫైబర్ ఉంటుంది. ఇది అన్నవాహిక చుట్టూ ఒక రక్షణ కవచంలా ఏర్పడి, దెబ్బతిన్న కణజాలాలు త్వరగా కోలుకునేలా చేస్తుంది.
అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపును తగ్గించి, కడుపుకు చల్లదనాన్ని ఇస్తాయి.
వీటికి వీలైనంత దూరంగా ఉండండి..
నూనెలో వేయించిన పదార్థాలు, కొవ్వులు అధికంగా ఉండే ఆహారం.
కాఫీ, చాక్లెట్లు, పిప్పర్‌మెంట్ ఫ్లేవర్ ఉన్న పదార్థాలు.
నిద్రపోయే భంగిమలో మార్పులు..
రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునేటప్పుడు తల, ఛాతీ భాగం కొద్దిగా ఎత్తులో ఉండేలా చూసుకోవాలి (కనీసం మూడు గంటల పాటు). ఇలా చేయడం వల్ల భూమ్యాకర్షణ శక్తి (Gravity) కారణంగా ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. అలాగే కడుపులోని ఆమ్లాలు గొంతులోకి తిరిగి వచ్చే అవకాశం తగ్గుతుంది. కడుపు నిండా తిన్న వెంటనే నిద్రపోకుండా కాసేపు నడవడం మంచిది.

