ఉదయం తీసుకునే అల్పాహారం (Morning Breakfast) ఆ రోజంతా మనకు కావాల్సిన శక్తిని ఇస్తుంది. కేవలం కడుపు నింపుకోవడానికే కాకుండా ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండే పోషకాహారాన్ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. సరైన అల్పాహారం తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగి, పదే పదే జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది.
అయితే, ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలామంది అల్పాహారాన్ని మానేయడం లేదా బిస్కెట్లు, ప్యాకేజ్డ్ స్నాక్స్, కూల్‌డ్రింక్స్‌పై ఆధారపడటం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన అల్పాహారం అంటే రుచిగా ఉండదనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ, అటు రుచిని ఇటు పోషకాలను సమృద్ధిగా అందించే అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్లు ఇక్కడ ఉన్నాయి.
వీటిని మీ డైట్‌లో చేర్చుకోండి..
ఓట్స్ (Oats)..
ఉదయం హడావుడిలో సులభంగా చేసుకోగలిగే పౌష్టికాహారం ఓట్స్. పాలు లేదా పెరుగుతో కలిపి దీనిని తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉండటం వల్ల కడుపు నిండిన భావనను కలిగించి, త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది. మరింత రుచి, పోషకాల కోసం అరటిపండు, యాపిల్ ముక్కలతో పాటు కొన్ని నట్స్, గింజలు కలుపుకోవచ్చు.
పెసరట్టు, పెసర చీలా (Moong Dal Chilla)..
ప్రొటీన్ ఎక్కువగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్లలో ఇది బెస్ట్. నానబెట్టిన పెసలతో పిండి రుబ్బుకుని.. అందులో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర ముక్కలు కలుపుకుని వేడివేడిగా పెసరట్టు వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. దీనికి పుదీనా చట్నీ లేదా పెరుగు తోడైతే రుచి రెట్టింపు అవుతుంది.
గుడ్లు (Eggs)..
ప్రొటీన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది కోడిగుడ్డు. ఉడికించిన గుడ్డు (boiled egg), ఆమ్లెట్ లేదా ఎగ్ భుర్జీ.. ఇలా ఏ రూపంలో తీసుకున్నా ఉదయం పూట ఎంతో మేలు. ఆమ్లెట్ వేసుకునేటప్పుడు కూరగాయల ముక్కలు (వెజిటబుల్స్) జోడిస్తే ప్రొటీన్‌తో పాటు ఇతర విటమిన్లు కూడా శరీరానికి అందుతాయి.
మొలకలు (Sprouts)..
పెసలు, శనగలు వంటి ధాన్యాలను మొలకల రూపంలో తీసుకుంటే శరీరానికి అవసరమైన ఫైబర్, ప్రొటీన్ దండిగా లభిస్తాయి. రోజూ మొలకలు తినడం ఇబ్బందిగా అనిపిస్తే.. వాటికి సన్నగా తరిగిన టమాటా, కీరదోస ముక్కలు, కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర జతచేసి 'స్ప్రౌట్స్ చాట్'లా తయారుచేసుకుంటే భలే రుచిగా ఉంటుంది.
పెరుగు - తాజా పండ్లు (Yogurt and Fruits)..
అల్పాహారం చేయడానికి అస్సలు సమయం లేనప్పుడు పెరుగులో తాజా పండ్ల ముక్కలు కలుపుకుని తినేయొచ్చు. ఇది చాలా త్వరగా పూర్తయ్యే బ్రేక్‌ఫాస్ట్. పెరుగు ద్వారా ప్రొటీన్, క్యాల్షియం లభిస్తే.. పండ్ల ద్వారా ఫైబర్, విటమిన్లు అందుతాయి. పైన కొన్ని వాల్‌నట్స్, బాదం వంటివి చల్లుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

