నోటి పూత (mouth ulcers) అనేది చిన్న సమస్యే అయినా.. దీనివల్ల ఆహారం తినడం, మాట్లాడటం చాలా కష్టంగా మారుతుంది. ఈ సమస్య కేవలం పొట్టకు సంబంధించిన ఇబ్బందుల వల్లే కాకుండా పోషకాహార లోపం, ఒత్తిడి వంటి ఇతర కారణాల వల్ల కూడా వస్తుంది.
జీర్ణకోశ సమస్యలతో సంబంధం ఉందా..?
అసిడిటీ, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు ఉన్నవారందరికీ నోటి పూత వస్తుందని కచ్చితంగా చెప్పలేం. కానీ, కొన్ని జీర్ణకోశ వ్యాధుల్లో ఇదొక లక్షణంగా కనిపిస్తుంది. కేవలం కడుపులో మంట మాత్రమే కాకుండా తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి, విటమిన్ బి12 లేదా ఐరన్ లోపం, హార్మోన్ల అసమతుల్యత, కొన్ని రకాల మందుల వాడకం వల్ల కూడా నోటిలో తరచుగా పుండ్లు ఏర్పడతాయి.
గోరువెచ్చని ఉప్పునీటిని పుక్కిలించడం..
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి నోట్లో వేసుకుని కాసేపు పుక్కిలించి ఉమ్మెయ్యాలి. రోజుకు రెండు, మూడు సార్లు ఇలా చేయడం వల్ల నోరు శుభ్రపడటమే కాకుండా.. పుండ్ల వల్ల వచ్చే మంట, నొప్పి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.
మసాలా, వేడి ఆహారానికి దూరం..
నోటి పూత ఉన్నప్పుడు మసాలాలు, పులుపు, ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు, మరీ వేడిగా ఉండే ఆహారం తీసుకోకపోవడం మంచిది. వీటివల్ల మంట మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో సాధ్యమైనంత వరకు మెత్తటి ఆహారాన్ని సాధారణ ఉష్ణోగ్రత వద్ద తీసుకోవాలి. శరీరానికి తగినంత నీరు అందించాలి.
పోషకాహారంపై శ్రద్ధ..
తరచుగా ఈ సమస్య వేధిస్తుంటే మీ ఆహారంలో ఐరన్, ఫోలేట్, విటమిన్ బి12 పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, గుడ్లు వంటివి రోజువారీ డైట్లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. సప్లిమెంట్లు వాడాలనుకుంటే మాత్రం ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలి.సాధారణంగా వచ్చే నోటి పూత కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది. అయితే రెండు వారాలకు పైగా ఈ సమస్య తగ్గకపోయినా, పుండ్లు మరీ పెద్దవిగా ఉండి విపరీతమైన నొప్పి ఉన్నా నిర్లక్ష్యం చేయకూడదు. పుండ్లతో పాటు జ్వరం రావడం, ఆహారం మింగడానికి ఇబ్బంది పడటం, అకారణంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.

