సాధారణంగా అందరూ ముందుకే నడుస్తుంటారు. కానీ, ఎప్పుడైనా వెనక్కి నడిచి (Backward Walking) చూశారా? వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించినా.. ఆరోగ్య నిపుణుల ప్రకారం వెనక్కి నడవడం వల్ల శారీరకంగా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ చేసే సాధారణ వాకింగ్‌లో కాసేపు 'ఉల్టా' నడకను జోడించడం ద్వారా మన శరీరానికి ఒక కొత్త రకమైన వ్యాయాయం అందుతుంది.
సాధారణ నడకకు భిన్నంగా ఉండే ఈ రివర్స్ వాకింగ్ వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెనక్కి నడవడం వల్ల కలిగే ముఖ్యమైనప్రయోజనాలు..
కాళ్ల కండరాలకు ప్రత్యేక వ్యాయాయం.. మనం ముందుకు నడిచే విధానానికి, వెనక్కి నడిచే విధానానికి చాలా తేడా ఉంటుంది. వెనక్కి నడిచేటప్పుడు కాళ్ల కండరాలపై (Leg Muscles) సాధారణం కంటే భిన్నమైన ఒత్తిడి పడుతుంది. రోజూ ఒకేలా వాకింగ్ చేసేవారు తమ రొటీన్లో కొద్ది నిమిషాల పాటు ఈ రివర్స్ వాకింగ్‌ను చేర్చుకుంటే కండరాలకు మంచి వ్యాయాయం లభిస్తుంది.
శరీర సమతుల్యత (Body Balance) మెరుగవుతుంది.. వెనక్కి నడిచేటప్పుడు మన కంటికి దారి స్పష్టంగా కనిపించదు. దీంతో ప్రతి అడుగునూ ఎంతో అప్రమత్తంగా, ఆలోచించి వేయాల్సి వస్తుంది. దీనివల్ల శరీరం తన బ్యాలెన్స్‌ను కాపాడుకోవడంపై మరింత ఏకాగ్రత పెడుతుంది. క్రమంగా ఈ అభ్యాసం శరీర నియంత్రణను, బ్యాలెన్స్‌ను మెరుగుపరుస్తుంది.
మోకాళ్లపై ఒత్తిడి మారుతుంది.. రివర్స్ వాకింగ్‌లో పాదాలను నేలపై ఉంచే విధానం, శరీరాన్ని ముందుకు కదిలించే తీరు మారుతుంది. దీనివల్ల మోకాళ్లపై, పాదాలపై పడే భారం సాధారణ వాకింగ్‌తో పోలిస్తే భిన్నంగా ఉండి, కీళ్ల కదలికలకు కొత్త శక్తినిస్తుంది.
నడిచే తీరుపై మెరుగైన నియంత్రణ.. వెనక్కి నడిచేటప్పుడు వేగంగా అడుగులు వేయడం కుదరదు. ప్రతి అడుగును చాలా జాగ్రత్తగా వేయాలి. దీనివల్ల కాళ్ల కదలికలపై, అడుగుల సమన్వయంపై మన దృష్టి కేంద్రీకృతమవుతుంది. క్రమంగా నడిచే విధానంలో (Walking Posture) మెరుగైన కంట్రోల్ సాధ్యమవుతుంది.
శరీరం,మెదడు చురుగ్గా ఉంటాయి.. ముందుకు నడవడం మనకు రోజూ అలవాటైన పనే. కానీ వెనక్కి నడవడం మెదడుకు, శరీరానికి ఒక కొత్త అనుభూతి. దిశను అంచనా వేయడానికి, సమతుల్యతను కోల్పోకుండా ఉండటానికి మెదడు చురుగ్గా పనిచేయాల్సి వస్తుంది. ఇది మెదడును, శరీరాన్ని ఒకేసారి యాక్టివ్‌గా ఉంచుతుంది.
సాధారణ వాకింగ్‌లో బోరు కొట్టదు (Challenging Workout)..
రోజూ ఒకే వేగంతో, ఒకేలా నడిచి విసిగిపోయిన వారికి ఈ రివర్స్ వాకింగ్ మంచి మార్పును ఇస్తుంది. సాధారణ వాకింగ్‌ను కొంచెం ఛాలెంజింగ్‌గా మార్చుకోవడానికి ఇది చక్కని మార్గం. కొత్త రకమైన మూవ్మెంట్ ప్రయత్నించడం వల్ల రోజూ వాకింగ్ చేయాలనే ఉత్సాహం కూడా పెరుగుతుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..మీకు తరచుగా తల తిరగడం, బ్యాలెన్స్ చేసుకోవడంలో ఇబ్బంది ఉండటం లేదా మోకాళ్లు, కాళ్లు, నడుము నొప్పి తీవ్రంగా ఉంటే ఈ వ్యాయాయం చేసే ముందు వైద్యుల లేదా ఫిజియోథెరపిస్ట్ సలహా తీసుకోవడం మంచిది.
వెనక్కి నడిచేటప్పుడు వెనుక ఏముందో స్పష్టంగా కనిపించదు కాబట్టి, పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని ఎప్పుడూ చదునైన ప్రదేశంలో, ఎవరి సహాయంతోనైనా లేదా పార్కుల్లోని సేఫ్ ట్రాక్‌లపై మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. వెనక్కి నడవడం చాలా సింపుల్ వ్యాయాయమే అయినప్పటికీ, ప్రారంభంలో తగినంత జాగ్రత్త ,ఏకాగ్రత చాలా అవసరం. దీన్ని కొద్ది నిమిషాల పాటు మీ వాకింగ్ రొటీన్లో సురక్షితమైన ప్రదేశంలో మాత్రమే చేయాలి.

