రక్తపోటు (bp) అనగానే చాలామందికి హై-బీపీ మాత్రమే గుర్తొస్తుంది. కానీ, బీపీ అవసరానికి మించి పడిపోవడం కూడా శరీరానికి ప్రమాదమే. దీనిని కేవలం సాధారణ నీరసంగా భావించి నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదు. శరీర భాగాలకు, ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్, పోషకాలు అందాలంటే రక్తపోటు సరైన స్థాయిలో ఉండటం ఎంతో ముఖ్యం.
బీపీ సాధారణ స్థాయి కంటే కిందకు పడిపోతే శరీరంలోని పలు అవయవాలకు రక్తప్రసరణలో ఆటంకం ఏర్పడుతుంది. వైద్య పరిభాషలో లో-బీపీని ‘హైపోటెన్షన్’ (Hypotension) అంటారు. కొందరిలో బీపీ తక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి లక్షణాలు కనిపించవు, వారికి పెద్దగా చికిత్స కూడా అవసరం ఉండకపోవచ్చు. కానీ తరచుగా బీపీ పడిపోతూ, తలతిరగడం, కళ్లు బైర్లు కమ్మడం వంటి సమస్యలు ఎదురైతే మాత్రం అప్రమత్తం కావాల్సిందే.
అసలు లో బీపీకి కారణాలేంటి..?
సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి బీపీ 120/80 ఎంఎంహెచ్‌జి (mmHg) ఉండాలి. ఇది 90/60 కంటే కిందకు పడిపోతే దాన్ని 'లో బీపీ'గా పరిగణిస్తారు. డీహైడ్రేషన్, కొన్ని రకాల మందుల వాడకం, ఎక్కువసేపు నిలబడటం, పోషకాహార లోపం ముఖ్యంగా విటమిన్ బి-12 లోపం లేదా ఇతర అనారోగ్య సమస్యల వల్ల రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవచ్చు.
శరీరం ఇచ్చే సంకేతాలివే..
బీపీ అకస్మాత్తుగా తగ్గినప్పుడు శరీరం పలు హెచ్చరికలు పంపు తుంది. ఆ లక్షణాలు ఇలా ఉంటాయి. కూర్చుని లేదా పడుకుని ఒక్కసారిగా లేచినప్పుడు కళ్ల ముందు చీకట్లు కమ్మడం, దృష్టి మసకబారడం. అకస్మాత్తుగా విపరీతమైన నీరసం ఆవహించడం, తల తిరగడం. వికారం, వాంతులు అయినట్లు అనిపించడం.ఏకాగ్రత లోపించడం, గందరగోళానికి గురికావడం. మరీ తీవ్రస్థాయికి చేరితే స్పృహ తప్పి పడిపోవడం.
వెంటనే వైద్యుడిని ఎప్పుడు కలవాలి..?
లో బీపీతో పాటు ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన గందరగోళం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాన్ని అత్యవసర పరిస్థితిగా భావించి వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
ఉపశమనం ఎలా అంటే..?
బీపీ తగ్గిన ప్రతీసారీ మందులు వాడాల్సిన అవసరం ఉండదు. కాస్త విశ్రాంతి తీసుకోవడం, ఒక గ్లాసు నీళ్లు లేదా ఓఆర్ఎస్ (ORS) తాగడం ద్వారా కోలుకోవచ్చు. శరీరంలో నీటిశాతం తగ్గకుండా ఎప్పటికప్పు డు ద్రవపదార్థాలు తీసుకుంటూ ఉండాలి. వైద్యుల సలహా మేరకు ఆహారంలో కాస్త ఉప్పు శాతాన్ని పెంచొచ్చు. అయితే గుండె, కిడ్నీ సమస్యలు, హై-బీపీ చరిత్ర ఉన్నవారు సొంత వైద్యం చేసుకోకూడదు.ఒక కప్పు కాఫీ లేదా కెఫిన్ ఉండే పానీయాలు తాగడం వల్ల తాత్కాలికంగా రక్తపోటు పెరిగి ఉపశమనం లభిస్తుంది.
బీపీ మందులు వాడేవారు క్రమం తప్పకుండా రీడింగ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మందుల మోతాదులో ఏమైనా మార్పులు చేయాలేమో డాక్టర్‌ను అడిగి తెలుసుకోవాలి. తరచుగా బీపీ పడిపోతుంటే కేవలం ఇంటి చిట్కాలపైనే ఆధారపడకుండా, అసలు కారణాన్ని తెలుసుకునేందుకు వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.

