సాధారణంగా రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అయినప్పుడు కణాల ఉపరితలంపై ఉండే HER2 (హ్యూమన్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ 2) అనే ప్రొటీన్ స్థాయిలను వైద్యులు పరీక్షిస్తారు. ఈ ప్రొటీన్ క్యాన్సర్ కణాలు వేగంగా పెరగడానికి, విభజన చెందడానికి సంకేతాలు ఇస్తుంది. గతంలో రోగులను కేవలం HER2-పాజిటివ్ లేదా HER2-నెగెటివ్ అనే రెండు వర్గాలుగానే విభజించేవారు. కానీ వైద్య పరిశోధనల పురోగతితో ఇప్పుడు 'HER2-low' అనే కొత్త ఉపవర్గాన్ని గుర్తించారు.
HER2-లో (HER2-low) అంటే..?
క్యాన్సర్ కణాలపై HER2 ప్రొటీన్ స్వల్ప మోతాదులో (తక్కువ స్థాయిలో) ఉండే పరిస్థితిని 'HER2-లో' అంటారు. గతంలో కణాలపై తక్కువ స్థాయిలో HER2 ప్రొటీన్ ఉంటే, దాన్ని పూర్తిగా HER2-నెగెటివ్‌గానే పరిగణించేవారు. దీనివల్ల అధునాతన 'టార్గెటెడ్ థెరపీ' మందులు వీరికి పనిచేయవని భావించి, కేవలం సాధారణ కీమోథెరపీ లేదా హార్మోన్ థెరపీలకే పరిమితం చేసేవారు.
ఆధునిక పరీక్షల్లో (ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ - IHC స్కోరు 1+ లేదా IHC 2+ తో ISH నెగెటివ్ ఉన్నప్పుడు) ఈ స్వల్ప ప్రొటీన్‌ను గుర్తించి 'HER2-లో'గా వర్గీకరిస్తున్నారు. దీనివల్ల సరికొత్త టార్గెటెడ్ మందుల ద్వారా క్యాన్సర్ కణాలను నేరుగా తుదముట్టించే వీలు కలుగుతోంది.
లక్షణాలు ఏమిటి..?
HER2-లో రకానికి ప్రత్యేకమైన ప్రత్యేక లక్షణాలు ఏవీ ఉండవు. సాధారణ రొమ్ము క్యాన్సర్‌లో కనిపించే లక్షణాలే దీనిలోనూ కనిపిస్తాయి:
రొమ్ములో లేదా చంక భాగంలో నొప్పిలేని గడ్డలు ఏర్పడటం, రొమ్ము పరిమాణం, ఆకారంలో అసాధారణ మార్పులు, చర్మంపై నొక్కుకుపోయినట్లు లేదా నారింజ తొక్కలాంటి మార్పులు (డింప్లింగ్)
చనుమొనలు లోపలికి ముడుచుకుపోవడం లేదా రక్తం/ద్రవాలు స్రవించడం, రొమ్ము చర్మం ఎర్రబడటం లేదా పొలుసులుగా మారడం,
ఇతర రొమ్ము క్యాన్సర్ల కంటే 'హెచ్ఈఆర్2-లో' ఎలా భిన్నమంటే..
రొమ్ము క్యాన్సర్లలో ప్రొటీన్ స్థాయి, చికిత్సా విధానం, రోగుల సంఖ్య ఆధారంగా ప్రధానంగా మూడు రకాల తేడాలు కనిపిస్తాయి. సాధారణంగా 15 నుంచి 20 శాతం మందిలో కనిపించే HER2-పాజిటివ్ రకంలో ఈ ప్రొటీన్ స్థాయి చాలా అధికంగా ఉండి కణాలు వేగంగా విస్తరిస్తాయి. వీరికి ప్రామాణిక టార్గెటెడ్ థెరపీ..ఉదాహరణకు ట్రాస్టుజుమాబ్ ద్వారా చికిత్స అందిస్తారు. ఇక మిగిలిన వారిలో ఎక్కువమందికి వచ్చే HER2-నెగెటివ్ రకంలో ఈ ప్రొటీన్ దాదాపు సున్నా లేదా గుర్తించలేనంత తక్కువగా ఉంటుంది కాబట్టి, వీరికి హార్మోన్ థెరపీ లేదా సంప్రదాయ కీమోథెరపీ మాత్రమే ఆధారమవుతుంది.
అయితే, గతంలో నెగెటివ్‌గా తేలిన రోగుల్లోనే దాదాపు 50 నుంచి 60 శాతం మందికి ఉండే ఉపవర్గమే 'HER2-లో' (HER2-low). ఇందులో ప్రొటీన్ పూర్తిగా లోపించకుండా స్వల్ప మోతాదులో ఉంటుంది. ఈ స్వల్ప ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుని సరికొత్త 'యాంటీబాడీ-డ్రగ్ కంజుగేట్' (ADC) వంటి ఆధునిక చికిత్సలు అందించే వీలుండటమే దీనిని మిగతా రకాల కంటే అత్యంత ప్రత్యేకమైనదిగా మారుస్తోంది.
వైద్యపరంగా ఇది ఎందుకు అతిపెద్ద ముందడుగు..?
ఇప్పటివరకు రొమ్ము క్యాన్సర్ ముదిరిన దశలో (metastatic) ఉన్న రోగులకు సంప్రదాయ కీమోథెరపీ తప్ప వేరే మార్గం ఉండేది కాదు. కీమోథెరపీ వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు రావడమే కాకుండా కొన్ని నెలలకే కణాలు దానికి లొంగకుండా మొండిగా మారేవి.
కానీ 'HER2-లో'గా గుర్తించడం వల్ల, యాంటీబాడీ-డ్రగ్ కంజుగేట్ (ADC) తరహా మందులు (ఉదాహరణకు ఎన్‌హెర్టు) ఒక గైడెడ్ మిస్సైల్లా పనిచేస్తాయి. కణాలపై ఉన్న అతిస్వల్ప HER2 ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుని, ఆరోగ్యకరమైన కణాలను తాకకుండా నేరుగా క్యాన్సర్ కణంలోకే వెళ్లి మందును విడుదల చేస్తాయి. ఫలితంగా కణితి పెరుగుదల తగ్గి, రోగుల ఆయుష్షు గణనీయంగా పెరుగుతుంది.

