ప్రొటీన్ అనగానే కేవలం జిమ్ చేసేవారికి, కండరాలు పెంచుకునే వారికే అవసరం అనుకుంటారు. కానీ, మన శరీరంలోని ప్రతి కణం, కణజాలం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్ తప్పనిసరి. వయసు, శారీరక శ్రమ, ఆరోగ్యాన్ని బట్టి దీని అవసరం మారుతుంటుంది. మన రోజువారీ ఆహారంలో ప్రొటీన్ దీర్ఘకాలం పాటు లోపిస్తే శరీరం కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది. అవేంటో తెలుసుకుందాం..
1. ఎప్పుడూ అలసట, నీరసం..
తగినంత విశ్రాంతి తీసుకుంటున్నా సరే.. ఎప్పుడూ నీరసంగా, శూన్యంగా అనిపిస్తుంటే ప్రొటీన్ లోపం కావచ్చు. రోజువారీ పనులు చేయడానికి కూడా కష్టంగా అనిపిస్తే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి.
2. కండరాల బలహీనత..
మెట్లు ఎక్కడం, బరువులు ఎత్తడం వంటి సాధారణ పనులు చేసినప్పుడు మునుపటి కంటే త్వరగా అలిసిపోతున్నారా..? ప్రొటీన్ అందకపోవడం వల్ల కండరాలు తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి.
3. జుట్టు రాలడం, గోళ్లు విరగడం..
మన కురులు, గోళ్ల ఆరోగ్యానికి ప్రొటీన్ అత్యవసరం. మీ ఆహారంలో తగినంత ప్రొటీన్ లేనప్పుడు జుట్టు విపరీతంగా రాలడం, గోళ్లు పెళుసుబారి పగిలిపోవడం వంటి మార్పులను గమనించవచ్చు.
4. తిన్న వెంటనే ఆకలి వేయడం..
భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఏదైనా తినాలనిపిస్తుంటే మీ డైట్ లోపం ఉన్నట్లే. ప్రొటీన్ కడుపు నిండిన భావనను ఎక్కువసేపు ఉంచుతుంది. కాబట్టి ఇది లోపించినప్పుడు పదే పదే ఆకలి వేస్తుంటుంది.
5. గాయాలు త్వరగా మానకపోవడం..
వ్యాయామం వల్ల కలిగే కండరాల నొప్పులు తగ్గాలన్నా, చిన్నచిన్న గాయాలు త్వరగా మానాలన్నా ప్రొటీన్ కణజాలాలను రిపేర్ చేయాలి. ఇది తగ్గితే కోలుకునే ప్రక్రియ బాగా నెమ్మదిస్తుంది.
6. తరచుగా జబ్బు పడటం..
మన రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే ప్రొటీన్లు ఎంతో అవసరం. ఇవి తగ్గితే శరీరంలో రోగాలతో పోరాడే శక్తి క్షీణించి, ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది.
ప్రొటీన్ లోపాన్ని అధిగమించడానికి ఏం తినాలి..?
మీ రోజువారీ డైట్లో ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. శాకాహారులైతే కందిపప్పు, పెసరపప్పు, శనగలు, రాజ్మా, సోయా, పనీర్, పెరుగు, పాలు, డ్రై ఫ్రూట్స్, గింజలు వంటివి తీసుకోవాలి. మాంసాహారులైతే కోడిగుడ్లు, చేపలు, చికెన్ వంటివి ఎంచుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.


