పండుగలు, శుభకార్యాలు అంటేనే పిండివంటలు, స్వీట్లు, పూరీలు, బజ్జీలు ముందుగా గుర్తుకొస్తాయి. రుచికి ఆశపడి వీటిని ఎక్కువగా తినేయడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, పుల్లటి త్రేన్పులు వంటి సమస్యలు వేధిస్తుంటాయి. పండుగ సీజన్లో నూనె పదార్థాలు, మసాలాలు తిన్న తర్వాత కడుపులో అసౌకర్యంగా ఉంటే కొన్ని ఇంటి చిట్కాలు, చిన్నపాటి ఆరోగ్య అలవాట్లు పాటిస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.
ఎసిడిటీని దూరం చేసే చిట్కాలు..
మితంగా తినాలి..నూనెలో వేయించిన పదార్థాలు జీర్ణం కావడానికి సమయం పడుతుంది, కడుపు బరువుగా మారుతుంది. కాబట్టి వాటితో పాటు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. ఒకేసారి కడుపు నిండా అతిగా తినకుండా, కొద్దికొద్దిగా పలుమార్లు తినడం మంచిది.
తిన్న వెంటనే పడుకోవద్దు..భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల ఛాతీలో మంట, ఎసిడిటీ సమస్యలు పెరుగుతాయి. తిన్న తర్వాత కాసేపు నిటారుగా కూర్చోవాలి. వీలైతే 10 నుంచి 15 నిమిషాల పాటు ఇంట్లోనే చిన్నగా నడవాలి.
తగినంత నీరు ముఖ్యం.. జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయాలంటే రోజుకు సరిపడా నీరు తాగాలి. అయితే ఒకేసారి గటగటా ఎక్కువగా తాగేయకుండా, రోజంతా కొద్దికొద్దిగా నీరు తీసుకుంటూ ఉండాలి.
వాముతో ఉపశమనం.. గ్యాస్, అజీర్తి సమస్యలకు వాము సాంప్రదాయ ఔషధంగా పనిచేస్తుంది. అయితే ఇది అందరికీ ఒకేలా ఫలితాన్ని ఇస్తుందని చెప్పలేం. ఎసిడిటీ పదే పదే వేధిస్తుంటే కేవలం ఇంటి చిట్కాలపైనే ఆధారపడకూడదు.
టీ, కాఫీలకు బ్రేక్.. అతిగా టీ, కాఫీలు తాగడం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం, పుల్లటి పదార్థాలు కొందరిలో ఎసిడిటీని అమాంతం పెంచుతాయి. కాబట్టి మీ కడుపుకు ఏవి పడవో గుర్తించి ఆయా పదార్థాలకు దూరంగా ఉండటం ఉత్తమం.
వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి..?
కేవలం అజీర్తిగానే కాకుండా విపరీతమైన కడుపు నొప్పి, ఆగని వాంతులు, వాంతిలో రక్తం పడటం, ఛాతీలో తీవ్రమైన నొప్పి లేదా మలం నల్లగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.


