ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుని పనిచేయడం, నిద్రలేమి, వేళకు భోజనం చేయకపోవడం.. ఇవన్నీ ఆధునిక జీవనశైలిలో భాగమైపోయాయి. కెరీర్, లక్ష్యాల సాధనలో పడి చాలామంది ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తున్నారు. దీనివల్ల చిన్న వయసులోనే మధుమేహం బారిన పడుతున్నారు. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఉద్యోగులు దినచర్యలో ఈ ఐదు చిన్నపాటి అలవాట్లను చేర్చుకోవడం తప్పనిసరి.
1. భోజనానికి ఓ వేళ.. చిరుతిళ్లు వద్దు..
పని ఒత్తిడిలో చాలామంది సమయానికి భోజనం చేయరు. ఆకలి వేసినప్పుడల్లా లేదా బోర్ కొట్టినప్పుడల్లా బిస్కెట్లు, చిప్స్, స్వీట్లు లాగించేస్తుంటారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం నిర్ణీత సమయానికే చేయాలి. ఒకవేళ మధ్యలో ఆకలి వేస్తే పండ్లు, వేయించిన శనగలు, డ్రై ఫ్రూట్స్ లేదా చక్కెర లేని పెరుగు తీసుకోవడం ఉత్తమం.
2. ఆహారంలో ప్రొటీన్, ఫైబర్ తప్పనిసరి..
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలంటే కేవలం తీపి పదార్థాలు మానేస్తే సరిపోదు. తీసుకునే ఆహారంలో ప్రొటీన్, ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఇవి త్వరగా జీర్ణమై ఆకలి వేయకుండా చేస్తాయి. అలాగే భోజనం తర్వాత అకస్మాత్తుగా షుగర్ లెవల్స్ పెరగకుండా నిరోధిస్తాయి.
3. కుర్చీకే అతుక్కుపోవద్దు..
కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల శరీరానికి కదలిక ఉండదు. అందుకే ప్రతి 30 నుంచి 60 నిమిషాలకోసారి సీట్లోంచి లేచి కొద్దిసేపు అటూఇటూ నడవాలి. ఫోన్ మాట్లాడేటప్పుడు కూర్చోకుండా నడుస్తూ మాట్లాడటం, లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోవాలి. రోజూ వాకింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా వినియోగించుకుంటుంది.
4. ఒత్తిడిని జయించండి.. కంటినిండా నిద్రపోండి..
పని ఒత్తిడి, టార్గెట్లు, రాత్రి పొద్దుపోయే వరకు ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చోవడం వల్ల నిద్రకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడి నేరుగా బ్లడ్ షుగర్‌పై ప్రభావం చూపుతాయి. రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర తప్పనిసరి. పడుకునే ముందు మొబైల్స్, ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం, దీర్ఘ శ్వాస పీల్చుకోవడం వంటివి సాధన చేయాలి.
5. క్రమం తప్పకుండా పరీక్షలు..
యువతలో షుగర్ వ్యాధి లక్షణాలు తొలినాళ్లలో స్పష్టంగా కనిపించవు. ఆరోగ్యంగానే ఉన్నాం కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉన్నా, అనూహ్యంగా బరువు పెరుగుతున్నా తరచుగా బ్లడ్ షుగర్, HbA1c పరీక్షలు చేయించు కోవడం ఎంతో ముఖ్యం.
దినచర్యలో ఈ చిన్న మార్పులతోనే మధుమేహాన్ని దరిచేరనీయకుండా అడ్డుకోవచ్చు. అతిగా దాహం వేయడం, తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లడం, కారణం లేకుండా బరువు తగ్గడం, విపరీతమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.


