తగినన్ని నీళ్లు తాగుతున్నా నోరు పదేపదే ఎండిపోతోందా..? పొడి ఆహారం మింగడానికి నీళ్లు తాగాల్సి వస్తోందా..? రాత్రిపూట గొంతు ఎండిపోయి మెలకువ వస్తోందా? అయితే దీన్ని కేవలం దాహం అనుకుని తేలిగ్గా తీసిపారేయకండి. ఇది 'జెరోస్టోమియా' అంటే నోరు పొడిబారడం అనే సమస్యకు సంకేతం కావచ్చు.
నోటిలోని లాలాజలం కేవలం ఆహారాన్ని నమలడానికే కాకుండా దంతాలు పుచ్చిపోకుండా కాపాడటంలో, రుచిని గుర్తించడంలో, ఇన్ఫెక్షన్లను అడ్డుకోవడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. లాలాజల ఉత్పత్తి తగ్గినప్పుడు దంతక్షయం, నోటి దుర్వాసన, ఆహారం మింగడంలో సమస్యలు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో జెరోస్టోమియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
లాలాజల ప్రాధాన్యం.. ఎందుకు లోపిస్తుంది..?
మన నోటిలో ప్రధానంగా మూడు జతల లాలాజల గ్రంథులు (Salivary Glands) ఉంటాయి. ఇవి రక్తంలోని నీరు, పోషకాలను సంగ్రహించి లాలాజలాన్ని తయారుచేస్తాయి. మనం ఆహారాన్ని చూడగానే, వాసన పీల్చగానే మెదడు ఈ గ్రంథులకు సంకేతాలు ఇచ్చి లాలాజల ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది.
జీర్ణక్రియకు ఆధారం..లాలాజలంలోని ఎంజైములు పిండిపదార్థాల జీర్ణ ప్రక్రియను నోట్లోనే ప్రారంభిస్తాయి.
ఆమ్లాల నియంత్రణ.. ఆహారంలో ఉండే యాసిడ్ ప్రభావాన్ని తగ్గించి దంతాల ఎనామిల్ దెబ్బతినకుండా రక్షిస్తుంది.
కణజాల రక్షణ..నోటి లోపలి సున్నితమైన చర్మాన్ని తడిగా ఉంచి పుండ్లు పడకుండా కాపాడుతుంది.
లాలాజలం తగ్గడానికి ప్రధాన కారణాలు..
మందుల దుష్ప్రభావాలు..రక్తపోటు నియంత్రణ మందులు (diuretics), అలర్జీకి వాడే యాంటీహిస్టమైన్లు, యాంగ్జైటీ, డిప్రెషన్ నివారణ మందులు లాలాజల ఉత్పత్తిని తగ్గిస్తాయి.
మధుమేహం (Diabetes)..రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు శరీరం మూత్రం ద్వారా గ్లూకోజ్‌ను బయటకు పంపుతుంది. దీనివల్ల డీహైడ్రేషన్ ఏర్పడి నోరు పొడిబారుతుంది.
ఆటో ఇమ్యూన్ వ్యాధులు.. 'స్జోగ్రెన్స్ సిండ్రోమ్' (Sjögren's Syndrome) వంటి సమస్యల్లో రోగనిరోధక వ్యవస్థే లాలాజల గ్రంథులపై దాడి చేయడం వల్ల లాలాజలం, కన్నీటి ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది.
నోటితో శ్వాసించడం.. జలుబు, అలర్జీ, గురక లేదా స్లీప్ ఆప్నియా వల్ల నిద్రలో నోటి ద్వారా ఊపిరి పీల్చడం వల్ల తేమ ఆవిరై ఉదయానికి గొంతు తీవ్రంగా ఎండుతుంది.
ఒత్తిడి, ఆందోళన.. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనప్పుడు నాడీ వ్యవస్థ ప్రతిస్పందించి లాలాజలాన్ని చిక్కగా మారుస్తుంది.
సాధారణ దాహం vs జెరోస్టోమియా..
దాహం అనేది శరీరంలో నీటి నిల్వలు తగ్గినప్పుడు మెదడు ఇచ్చే సహజమైన హెచ్చరిక. నీళ్లు తాగగానే ఆ సమస్య సమసిపోతుంది. కానీ జెరోస్టోమియా అనేది లాలాజల గ్రంథుల పనితీరు మందగించడం వల్ల వస్తుంది. తగినంత నీరు తాగినప్పటికీ నోరు పొడిగా, జిగటగా అనిపించడం, నాలుక అంగిలికి అంటుకుపోవడం దీని ప్రధాన లక్షణం.
దంత ఆరోగ్యంపై ప్రభావం..
లాలాజలం సహజమైన మౌత్ వాష్‌లా పనిచేస్తుంది. అది తగ్గినప్పుడు..
ఆహార కణాలు దంతాల మధ్య ఇరుక్కుపోయి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
దంత క్షయం (cavities), పిప్పి పళ్లు వేగంగా ఏర్పడతాయి.
చిగుళ్ల వాపు, రక్తస్రావం మొదలవుతాయి.
నోటిలో తెల్లటి పొరలా ఏర్పడే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు పెరుగుతుంది.


