శరీరం సజావుగా శక్తిని ఉత్పత్తి చేసే జీవక్రియల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఏర్పడే సంక్లిష్ట సమస్యే ‘మెటబాలిక్ సిండ్రోమ్’. ఇది ఏ ఒక్క వ్యాధో కాకుండా పొట్ట చుట్టూ కొవ్వు చేరడం, అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, ట్రైగ్లిజరైడ్ల పెరుగుదల, మంచి కొలెస్ట్రాల్ (HDL) పడిపోవడం వంటి ఐదు ప్రధాన ప్రమాదాల్లో ఏవైనా మూడు ఒకేసారి దాడి చేయడాన్ని సూచిస్తుంది. అధ్యయనాల ప్రకారం మన దేశ పట్టణ ప్రాంతాల్లోని ప్రతీ ముగ్గురు పెద్దల్లో ఒకరు ఈ సమస్యతో సతమతమవుతుండగా, 50 ఏళ్లు దాటిన వారిలో ఈ సంఖ్య 40 శాతాన్ని మించుతోంది. ప్రారంభంలో స్పష్టమైన రోగలక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలామంది దీనిని గుర్తించలేక ‘సైలెంట్ హెల్త్ థ్రెట్’గా మారుతోంది.
ఈ స్థితికి ప్రధాన మూలకారణం ఇన్సులిన్ నిరోధకత (insulin resistance). శరీర కణాలు ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించు కోలేకపోయినప్పుడు రక్తంలో గ్లూకోజ్ పెరిగి, దానిని నియంత్రించేందు కు క్లోమం మరింత ఎక్కువ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. కాలక్రమేణా ఇది రక్తపోటు, కొవ్వు నిల్వలపై దుష్ప్రభావం చూపిస్తుంది. పైకి సన్నగా కనిపించినా లోపలి కాలేయం, పేగుల చుట్టూ విసెరల్ ఫ్యాట్ పేరుకుపోయే ‘స్కిన్నీ ఫ్యాట్’ వ్యక్తుల్లోనూ ఈ ముప్పు ఉంటుంది. ఫలితంగా గుండెపోటు, పక్షవాతం, ఫ్యాటీ లివర్, మూత్రపిండాల వ్యాధులతో పాటు పురుషుల్లో అంగస్తంభన లోపాలు, మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత వంటి లైంగిక, ప్రత్యుత్పత్తి సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం పెరుగుతుంది.
మెటబాలిక్ సిండ్రోమ్ శాశ్వత సమస్య కానందున, ప్రారంభ దశలోనే గుర్తించి జీవనశైలిని మార్చుకోవడం ద్వారా దీనిని పూర్తిగా సాధారణ స్థితికి (Reverse) తీసుకురావచ్చు. రోజువారీ ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే పప్పుదినుసులు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్ చేర్చుకుంటూ.. పంచదార, కూల్డ్రింకులు, ప్యాక్డ్ అల్ట్రాప్రాసెస్డ్ ఆహారాలకు దూరంగా ఉండాలి. రోజూ నడకతో పాటు వారానికి 2–3 రోజులు కండరాలను బలోపేతం చేసే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం, 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర పోవడం, మానసిక ఒత్తిడి వల్ల అతిగా తినే ‘స్ట్రెస్ ఈటింగ్’ను అదుపులో ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. క్రమం తప్పకుండా బీపీ, షుగర్, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకుంటూ అప్రమత్తంగా ఉంటే ఈ తీవ్ర సమస్యల నుంచి సురక్షితంగా బయటపడవచ్చు.


