భారతీయుల భోజనంలో అన్నం లేనిదే ముద్ద దిగదు. పప్పు అన్నం, బిర్యానీ, పులావ్.. ఇలా ఏది తినాలన్నా బియ్యం ప్రధానమే. అయితే, ఇటీవల ఆరోగ్య స్పృహ పెరగడంతో చాలామంది అన్నం తినే విధానంలో మార్పులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలను కునేవారు తెల్ల బియ్యం (White Rice) మానేసి, ముడి బియ్యం (Brown Rice) వైపు మొగ్గు చూపుతున్నారు. బ్రౌన్ రైస్‌లో ఉండే పోషకాలు, పీచుపదార్థమే ఇందుకు ప్రధాన కారణం.
అయితే, బ్రౌన్ రైస్ ఆరోగ్యకరం అన్నంత మాత్రాన వైట్ రైస్ పూర్తిగా చెడ్డది అని అర్థం కాదు. ఈ రెండింటికీ వాటి స్వంత ప్రయోజనాలు, పరిమితులు ఉన్నాయి. బియ్యం రకం, తినే పరిమాణం, వండే విధానం కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం.
1. పీచు పదార్థం (fiber) ఏందులో ఎక్కువ..?
బ్రౌన్ రైస్‌కి పాలిష్ తక్కువ చేస్తారు. దీనివల్ల బియ్యం పైపొర (bran), పిండం (germ) అలాగే ఉంటాయి. అందుకే తెల్ల బియ్యంతో పోలిస్తే ముడి బియ్యంలో ఫైబర్, మెగ్నీషియం, బి-విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది. మీ ఆహారంలో ఫైబర్ పెంచుకోవాలనుకుంటే బ్రౌన్ రైస్ సరైన ఎంపిక.
2. బ్రౌన్ రైస్ తింటే షుగర్ పెరగదా..?
బ్రౌన్ రైస్‌లో ఉండే ఫైబర్ కారణంగా అందులోని స్టార్చ్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా అదుపులో ఉంటాయి. అయితే, బ్రౌన్ రైస్ తిన్నంత మాత్రాన మధుమేహం రాకుండా గ్యారెంటీ ఉంటుందని భావించడం పొరపాటు. ఇది కేవలం బ్లడ్ షుగర్ పెరిగే వేగాన్ని మాత్రమే నియంత్రించగలదు.
3. కేవలం రంగు కాదు.. రకం కూడా ముఖ్యమే..!
మార్కెట్లో బ్రౌన్, వైట్ రైస్‌లో కూడా ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటి ప్రభావం ఒకేలా ఉండదు. బియ్యంలో ఉండే 'అమిలోజ్' (Amylose) అనే స్టార్చ్.. అన్నం ఎంత త్వరగా జీర్ణమవుతుంది అనే విషయాన్ని నిర్దేశిస్తుంది. కొన్ని రకాల బియ్యంలో అమిలోజ్ ఎక్కువగా ఉండి నెమ్మదిగా జీర్ణమవుతాయి. కాబట్టి, కేవలం రంగు చూసి నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతి కాదు.
4. తెల్ల బియ్యాన్ని తప్పుబట్టలేం..!
మిల్లింగ్ చేసే ప్రక్రియలో తెల్ల బియ్యం పైపొర తొలగిపోతుంది. దీంతో ఫైబర్, కొన్ని పోషకాలు తగ్గుతాయి. కానీ, ఇది త్వరగా ఉడుకుతుంది. సులభంగా జీర్ణమవుతుంది. ఎవరికైతే ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోమని వైద్యులు సూచిస్తారో (ఉదాహరణకు కొన్ని రకాల జీర్ణ సమస్యలు ఉన్నవారికి), వారికి బ్రౌన్ రైస్ కంటే వైట్ రైసే మేలు చేస్తుంది. కాబట్టి, ఎవరి ఆరోగ్య అవసరాలకు తగ్గట్టుగా వారు బియ్యాన్ని ఎంచుకోవాలి.
5. వండే విధానం, నిల్వ చేసే పద్ధతి..
బియ్యాన్ని ఎలా వండుతున్నామనే దానిపై కూడా పోషకాల లభ్యత ఆధారపడి ఉంటుంది. ఉప్పుడు బియ్యం (Parboiled Rice) వండటం వల్ల పోషకాలు గింజల లోపలే నిక్షిప్తమై ఉంటాయి. అలాగే, వండిన అన్నాన్ని చల్లార్చడం వల్ల అందులో 'రెసిస్టెంట్ స్టార్చ్' ఏర్పడుతుంది. ఇది సాధారణ స్టార్చ్లా త్వరగా జీర్ణం కాకుండా పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
వండిన అన్నాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు అలాగే వదిలేయకూడదు. త్వరగా చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తినేముందు బాగా వేడి చేయాలి. అలాగని అన్నాన్ని పదే పదే వేడి చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.
మీ ఆహారంలో ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉండాలనుకుంటే బ్రౌన్ రైస్‌ను మీ రోజువారీ డైట్లో చేర్చుకోవచ్చు. అలాగే మీ శరీర తత్వాన్ని బట్టి, సులభంగా జీర్ణమయ్యే ఆహారం కావాలనుకుంటే మితంగా వైట్ రైస్ తీసుకోవచ్చు. అసలు విషయం ఏమిటంటే, ఏ రైస్ తిన్నా సరైన పరిమాణంలో, పోషకవిలువలున్న కూరగాయలు, ఆకుకూరలు జోడించి తినడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది.


