భానుడి భగభగలకు తోడు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈ కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ఒక పెద్ద సవాలు. అయితే, మనం తీసుకునే ఆహారమే మన శరీర ఉష్ణోగ్రతను డిసైడ్ చేస్తుందని మీకు తెలుసా..? ఆయుర్వేదం ప్రకారం మనం తినే కొన్ని పదార్థాలు శరీరంలో మరింత వేడిని పెంచుతాయి. ఫలితంగా ఎసిడిటీ, డీహైడ్రేషన్, నీరసం వంటి సమస్యలు చుట్టుముడతాయి.
కడుపులో మంట పుట్టించే 'ఆ' పదార్థాలకు దూరం..!
వేసవిలో జీవక్రియలు మందగిస్తాయి. ఈ సమయంలో పలు ఆహార పదార్థాలను అతిగా తీసుకుంటే లేనిపోని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లే.. అటువంటి వాటిలో..
అల్లం, వెల్లుల్లి.. ఇవి రోగనిరోధక శక్తికి మంచివే అయినప్పటికీ, వీటి స్వభావం చాలా వేడి. ఎండకాలంలో కూరల్లో అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను ఎక్కువగా వాడటం వల్ల కడుపులో మంట, గుండెల్లో అసిడిటీ, అసౌకర్యం పెరుగుతాయి. కాబట్టి వీటి వాడకాన్ని వీలైనంత తగ్గించాలి.
సెలెరీ (వాము/ఆకు)..
సాధారణంగా జీర్ణక్రియ మెరుగుపడటానికి సెలెరీ (Celery) తోడ్పడుతుంది. కానీ, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు దీనిని అతిగా తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత పెరిగి, త్వరగా డీహైడ్రేషన్ (నిర్జలీకరణం) బారిన పడే ప్రమాదం ఉంది.
చిరుధాన్యాలు..
సజ్జలు, రాగులు వంటి కొన్ని రకాల మిల్లెట్లు శీతాకాలంలో శరీరానికి మేలు చేస్తాయి. ఎందుకంటే వీటి నైజం వేడి చేయడం. వేసవిలో మిల్లెట్ పిండితో చేసిన వంటకాలను ఎక్కువగా తింటే శరీరం బరువెక్కినట్లు అనిపించడంతో పాటు విపరీతమైన ఉక్కపోతకు గురవుతారు.
శరీరాన్ని చల్లబరిచే 'అమృతాహారం' ఇదే..
ఎండల నుంచి ఉపశమనం పొంది, కడుపు చల్లగా ఉండాలంటే మన రోజువారీ ఆహారంలో వీటిని తప్పక భాగం చేసుకోవాలి.
1. సోంపు - జీలకర్ర..
ఇవి శరీరానికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన కూలర్లు. సోంపు గింజలు, జీలకర్ర కడుపులోని వేడిని లాగేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి గ్యాస్ సమస్యలను నివారిస్తాయి. భోజనం తర్వాత కొద్దిగా సోంపు నమలడం లేదా జీలకర్ర నీరు తాగడం వల్ల శరీరం రిఫ్రెష్ అవుతుంది.
2. యాలకులు..
సువాసనతో పాటు యాలకులు శరీరానికి చలవ చేస్తాయి. ఎసిడిటీని తగ్గించడంలో, నోటి దుర్వాసనను దూరం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. వేసవిలో ఇది మనసుకు, శరీరానికి తాజాదనాన్ని ఇస్తుంది.
3. జొన్నలు - బార్లీ..
ఎండకాలంలో అన్నానికి ప్రత్యామ్నాయంగా జొన్నలు, బార్లీలను ఎంచుకోవడం ఎంతో ఉత్తమం. ఇవి చాలా తేలికగా అరగడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను, శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా బార్లీ నీరు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతుంది.
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం తినే ఆహార అలవాట్లలో కొన్ని కీలక మార్పులు చేసుకోవడం ఎంతో అవసరం.
ఈ కాలంలో విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది, కాబట్టి శరీరానికి వేడి చేసే పదార్థాలను వీలైనంత వరకు దూరం పెట్టాలి. ముఖ్యంగా కూరల్లో అధికంగా అల్లం, వెల్లుల్లి వాడటం తగ్గించాలి, ఎందుకంటే ఇవి కడుపులో మంటను, ఎసిడిటీని పెంచుతాయి. అలాగే సాధారణంగా జీర్ణక్రియకు మంచిదే అయినప్పటికీ, వేసవిలోవాము అధిక వాడకం వల్ల శరీరం మరింత వేడెక్కి డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. వీటితో పాటు శీతాకాలానికి సరిపోయే, వేడి చేసే గుణమున్నచిరుధాన్యాల వంటకాలను కూడా ఎండకాలంలో పరిమితంగానే తీసుకోవడం మంచిది.
మరోవైపు, భానుడి భగభగల నుంచి ఉపశమనం పొందడానికి శరీరాన్ని లోపలి నుండి చల్లబరిచే చలవ చేసే పదార్థాలను డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఇందుకోసం నిత్యం సోంపు మరియు జీలకర్ర నీటిని తాగడం వల్ల కడుపులోని వేడి తగ్గి జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. ఆహారంలో యాలకులు, పుదీనా వంటి ప్రకృతి సిద్ధమైన కూలర్లను భాగం చేసుకోవడం వల్ల శరీరానికి తాజాదనం లభిస్తుంది. వీటన్నింటితో పాటు ఉదయాన్నే జొన్న జావ లేదా బార్లీ నీరు వంటి తేలికపాటి, పోషకాలున్న పానీయాలు తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండటమే కాకుండా, రోజంతా కావలసిన శక్తి లభిస్తుంది. వేసవిలో లభించే మజ్జిగ, కొబ్బరినీళ్లతో పలు ఆహార నియమాలను పాటిస్తే.. భానుడి వేడి నుంచి మన శరీరాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు. ఈరోజే మీ ఆహార అలవాట్లను మార్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి..!

