కడుపునొప్పి, జీర్ణ సమస్యలు, కళ్లు లేదా చర్మం పసుపు రంగులోకి మారడం గమనిస్తున్నారా? అయితే ఇవి కాలేయ సమస్యలకు సంకేతాలు కావచ్చు. మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం ఒకటి. కానీ, దీని ఆరోగ్యం గురించి సమాజంలో ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఇవి ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేయడమే కాకుండా, సరైన వైద్యం అందకుండా చేస్తున్నాయి.
మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు లివర్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఆహారం, మద్యం, ఊబకాయం, వ్యాయామం లేమి కారణంగా నేటి యువత కూడా ఫ్యాటీ లివర్, హెపటైటిస్, సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాలేయ వ్యాధులపై అవగాహన చాలా అవసరం.. ఎందుకంటే వ్యాధుల కంటే వాటికి సంబంధం లేని అపోహాలతోనే కాలేయానికి ఎక్కువ ముప్పు తెస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సమాజంలో బలంగా నాటుకుపోయిన ఆ అపోహలు, వాస్తవాలు ఏమిటో చూద్దాం..
అపోహ: కాలేయాన్ని శుద్ధి చేయడానికి ప్రత్యేక పానీయాలు, ఆహారం అవసరం..?
వాస్తవం: శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో కాలేయానిదే కీలకపాత్ర. అయితే, అది సక్రమంగా పనిచేయడానికి ఎలాంటి ప్రత్యేక డిటాక్స్ డైట్‌లు, పానీయాలు అవసరం లేదు. రక్తాన్ని శుద్ధి చేయడం, పైత్యరసాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా లివర్ తనను తాను శుభ్రం చేసుకుంటుంది. కృత్రిమ డిటాక్స్ పానీయాల కంటే.. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ఉండే ప్రోటీన్‌తో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటే చాలు.
అపోహ: మద్యం తాగే వారికే కాలేయ వ్యాధులు వస్తాయి..?
వాస్తవం: అతిగా మద్యం సేవించడం వల్ల కాలేయం దెబ్బతింటుంది, సిర్రోసిస్ వంటి వ్యాధులు వస్తాయన్నది నిజమే. కానీ, అది మాత్రమే ఏకైక కారణం కాదు. జన్యుపరమైన సమస్యలు, ఆటోఇమ్యూన్ వ్యాధులు, మనం తీసుకునే అనారోగ్యకరమైన ఆహారం వల్ల కూడా లివర్ దెబ్బతింటుంది. హెపటైటిస్ వంటి ఇన్ఫెక్షన్లు కూడా కాలేయానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి.
అపోహ: కాలేయం దెబ్బతింటే వెంటనే లక్షణాలు కనిపిస్తాయి..?
వాస్తవం: కాలేయానికి తీవ్ర నష్టం జరిగే వరకు ఎలాంటి లక్షణాలు బయటపడకపోవచ్చు. అది దెబ్బతిన్నా సరే చాలాకాలం పాటు సాధారణంగానే పనిచేస్తూ తన విధులు నిర్వర్తిస్తుంది. తీవ్రమైన అలసట, కామెర్లు అంటే చర్మం, కళ్లు పసుపు పచ్చగా మారడం, కడుపునొప్పి, వాపు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే.. అప్పటికే లివర్ గణనీయంగా దెబ్బతిన్నట్లు లెక్క. అందుకే ముందస్తుగా సమస్యలను గుర్తించడానికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం.
అపోహ: సప్లిమెంట్లు వాడితే కాలేయ వ్యాధులను నివారించవచ్చు..?
వాస్తవం: కాలేయ వ్యాధిని పూర్తిగా రాకుండా అడ్డుకునే లేదా రాత్రికి రాత్రే నయం చేసే అద్భుతమైన మాత్రలు, సప్లిమెంట్లు ఏవీ లేవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పైగా, సొంత వైద్యంతో వాడే కొన్ని రకాల సప్లిమెంట్లు కాలేయంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయి. ఏ మందు లేదా కొత్త ఆహార నియమాలు మొదలుపెట్టాలన్నా తప్పనిసరిగా మీ వైద్యుడి సలహా తీసుకోవాలి.

